1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2015 (19:24 IST)

ఉపాధ్యాయులు స్వతహాగా చైతన్యవంతులు కావాలి: రాష్ట్రపతి పిలుపు

ఉపాధ్యాయులు స్వతహగా చైతన్యవంతులు కావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపు నిచ్చారు. భావి భారతావని బాధ్యతను భుజాలపై మోసే పౌరులుగా విద్యార్థులను ఉపాధ్యాయులు తయారు చేయాలన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు విలువలు నేర్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని ప్రణబ్ స్పష్టం చేశారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసిన సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలోనే కుల, మత, లింగ, వర్గ, వైషమ్యాల్ని తుడిచివేసే విధంగా, అందరూ సమానమేనని భావించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయాలన్నారు. 
 
గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఆవరణలోని డా. రాజేంద్ర‌ప్ర‌సాద్ స‌ర్వోద‌య విద్యాల‌యంలో విద్యార్థుల‌కు పొలిటిక‌ల్ హిస్ట‌రీ పాఠాలు చెప్పిన సంగతి తెలిసిందే. సుమారు 9 రాష్ట్రాల‌కు చెందిన 800 మంది విద్యార్ధుల‌కు ప్ర‌ణ‌బ్ పాఠాలను బోధించారు. త‌న చిన్న నాటి చిలిపి ప‌నుల‌ను, సుదీర్ఘ అనుభ‌వాల‌ను విద్యార్ధుల‌తో పంచుకున్నారు.
 
చ‌దువుకునే రోజుల్లో 5 కిలో మీట‌ర్లు న‌డిచి వెళ్లి చ‌దువుకునే వాడినని ప్ర‌ణ‌బ్ తెలిపారు. మేము చ‌దువుకునే రోజుల్లో కిరోసిన్‌తో వెలిగే దీపాలు ఉండేవ‌ని, వాటి వెలుతురులోనే చ‌దువుకున్నామ‌న్నారు. చిన్న‌తనంలో చాలా అల్ల‌రి చేసేవాడిన‌ని తెలిపారు. త‌న చేత అమ్మ బ‌ల‌వంతంగా ప‌ని చేయించేద‌ని చెబుతూ, అనాటి జ్ఞాప‌కాల‌ను గుర్తుచేసుకున్నారు. తాను యావ‌రేజ్ స్టూడెంట్‌నే న‌ని, వెనుక‌బ‌డ్డ ప్రాంతం నుంచి వ‌చ్చిన వాడినేన‌ని అన్నారు. అంతేకాకుండా త‌న‌ను ముఖ‌ర్జీ స‌ర్ అని పిల‌వాల‌ని, ఎవైనా సందేహాలు ఉంటే నిస్సంకోచంగా అడ‌గాల‌ని విద్యార్థులకు వెల్లడించారు.