శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (09:37 IST)

శిశువు మృతి.. బాలింతను బంధించిన ఆస్పత్రి యాజమాన్యం.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్‌లో శిశువు మృతి చెందిన తర్వాత బాలింతను బంధించారు. రూ.20 వేలు చెల్లించిన తరువాతనే తల్లిని డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది. దీంతో అమ్మమ్మ ఆ శిశువు మృతదేహాన్ని తీసుకుని, పోలీసుల దగ్గరకు వెళ్లి సహాయం చేయాలని కోరింది. 
 
వైద్యఆరోగ్యశాఖకు చెందిన ఇద్దరు అధికారులు ముందుకువచ్చి, బాధితులు ఆసుపత్రిలో చెల్లించాల్సిన బిల్లును మాఫీ చేయించి, ఆ మహిళ డిశ్చార్జ్ అయ్యేలా చూశారు. ఇప్పుడు ఈ ఉదంతంపై దర్యాప్తునకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ఘటన యూపీలోని మీరట్‌లో గల గౌహర్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే హాపుర్ చుంగీ సమీపంలో గౌహర్ ఆసుపత్రి ఉంది. ఖర్‌ఖైదా పరిధిలోని పీపలీఖెడాకు చెందిన ముబారిక్ తన భార్య గుల్షన్‌ను డెలివరీ కోసం గౌహర్ ఆసుపత్రిలో చేర్పించాడు. స్టాఫ్ నర్స్ డెలివరీ చేయడంతో శిశువు మృతి చెందాడని అతను ఆరోపిస్తున్నాడు. పైగా రూ.20 వేలు చెల్లించిన తరువాతనే భార్యను డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపిందని ముబారిక్ పేర్కొన్నాడు.
 
దీంతో గుల్షన్ తల్లి ఆ మృత శిశువును తీసుకుని పోలీస్ కమిషన్ దగ్గరకు వెళ్లి, విషయమంతా తెలిపింది. దీంతో ఆధికారులు ఆ ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు చేపట్టి, ఆ మహిళను డిశ్చార్జ్ చేసేలా చూశారు. ప్రస్తుతం ఈ ఉదంతంపై విచారణకు దర్యాప్తు కమిటీని నియమించారు.