బీజేపీకి రూ.10122 కోట్లు, బీఆర్ఎస్‌కు రూ.300 కోట్ల విరాళాలు
దేశంలోని రాజకీయ పార్టీల్లో అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలిచింది. ఈ పార్టీకి గత గత ఆరేళ్ల కాలంలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఏకంగా రూ.10122 కోట్ల విరాళాలను సేకరించింది. అంటే ఒక్క బీజేపీకి మాత్రమే 52 శాతం విరాళాలు వచ్చాయి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి రూ.1547 కోట్లు, టీఎంసీకి రూ.823 కోట్లు, బీఆర్ఎస్‌కు రూ.300 కోట్లు చొప్పున విరాళాలు వచ్చాయి.
గత 2016-17 నుండి 2021-22 మధ్య ఆరేళ్ల కాలంలో ఇతర అన్ని జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాలతో పోలిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మూడు రెట్లు ఎక్కువగా వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఎస్ఈడబ్ల్యు) సంయుక్తంగా తయారు చేసిన నివేదిక ప్రకారం... రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలలో సగానికిపైగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారానే వస్తున్నాయి.
గత ఆరేళ్ల కాలంలో అత్యధికంగా వీటి నుండి వచ్చినట్లు వెల్లడించింది. బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలలో 52 శాతం కంటే ఎక్కువ అంటే రూ.5,271.97 కోట్ల విలువైన మొత్తం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చాయి. మిగతా అన్ని ఇతర జాతీయ పార్టీలు రూ.1783.93 కోట్లను ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అందుకున్నాయి.
ఈ ఆరేళ్ల కాలంలో ఏడు జాతీయ పార్టీలు, 24 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన విరాళాల మొత్తం రూ. 16,437 కోట్లు. ఇందులో 56 శాతం అంటే రూ.9,188.35 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చాయి. బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలు రూ.10,122 కోట్లు, కాంగ్రెస్ కు రూ.1,547.43 కోట్లు, టీఎంసీకి రూ.823.30 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది.
ఏడు జాతీయ పార్టీలు, 24 ప్రాంతీయ పార్టీలకు మొత్తం వచ్చిన విరాళాలలో రూ.4,614 కోట్లు కార్పోరేట్ రంగం నుండి వచ్చాయి. బీజేపీకి 32 శాతం వచ్చాయి. అన్ని పార్టీలకు కలిపి రూ.2,634 కోట్లు ఇతర వనరుల నుండి వచ్చాయి. మొత్తం విరాళాల్లో 80 శాతం వాటా జాతీయ పార్టీలదే. దీని విలువ రూ.13,190 కోట్లు. ఈ ఆరేళ్ల కాలంలో అత్యధికంగా విరాళాలు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వచ్చాయి. ఆరేళ్లలో బీజేడీకి రూ.622 కోట్లు, డీఎంకేకు రూ. 431 కోట్లు, బీఆర్ఎస్ కు రూ.383 కోట్లు, వైసీపీకి రూ.330 కోట్లు వచ్చాయి.