శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (09:19 IST)

సెప్టెంబర్ 25 తర్వాత దేశవ్యాప్తంగా 46 రోజులు మళ్లీ లాక్ డౌన్..?

దేశంలో సెప్టెంబర్ 25 తర్వాత మళ్లీ లాక్ డౌన్ అమలు చేయబడుతుందా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కరోనా వైరస్ సంక్రమణ వ్యాప్తిని అరికట్టడానికి మార్చి 25న భారతదేశంలో పూర్తి లాక్ డౌన్ విధించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను నియంత్రించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. వ్యాధి మాత్రం అదుపులోకి రాలేదు. 
 
లాక్ డౌన్ కారణంగా ప్రజల జీవనోపాధి, ఆర్థిక వ్యవస్థను పరిగణనలోకి తీసుకొని గత జూన్ నుండి మొదటి సారిగా లాక్ డౌన్‌లో క్రమంగా సడలింపులు ప్రకటించడం జరిగింది. అన్ లాక్ ప్రక్రియ ప్రస్తుతం అమలులో వుంది. అయినా దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తోంది. ఇలాగే కొనసాగితే.. కరోనా కేసుల విషయంలో భారత్ అమెరికాను అధిగమించినా ఆశ్చర్యం లేదు.  
 
ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ 25 నుండి మళ్లీ లాక్ డౌన్ అమలు చేయాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సిఫారసు చేసినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. జాతీయ విపత్తు నిర్వహణ సమాఖ్య, ప్రణాళికా సంఘంతో కలిసి, దేశంలో కరోనా ప్రభావాన్ని నియంత్రించడానికి సెప్టెంబర్ 25 నుండి 46 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ను అమలు చేయాలని సమాఖ్య ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్లు ఆన్‌లైన్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 
 
అయితే, ఈ సమాచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (పిఐపి) పూర్తిగా ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ నివేదిక బూటకమని ఖండించింది. లాక్ డౌన్ అమలు చేయాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సమాఖ్య ప్రభుత్వాన్ని కోరలేదని స్పష్టం చేసింది.