శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (10:51 IST)

నేడు మిస్సైల్ మ్యాన్ జయంతి... నేతల నివాళులు

మిస్సైల్ మ్యాన్, భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు గురువారం జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని కలాం సేవలను అనేక మంది నేతలు స్మరించుకుంటూ ట్విటర్ ఖాతాల్లో తమతమ స్పందనలు తెలుపుతున్నారు. 
 
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు...
మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. భారత రక్షణ వ్యవస్థకు అణుశక్తిని జోడించి మిసైల్ మ్యాన్‌గా, అధ్యాపకుడిగా, మేధావిగా, స్ఫూర్తిదాయక రచయితగా. భవిష్యత్ భారతానికి వారు చేసిన మార్గదర్శనం చిరస్మరణీయం.
 
నారా చంద్రబాబు నాయుడు ...
అబ్దుల్ కలాం అంటే ఒక స్ఫూర్తి శిఖరం. పరిణతి సాధించిన అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. దేశ అణు, శాస్త్రీయ రంగాలకు సరికొత్త మార్గనిర్దేశనం చేసిన దార్శనికుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారి జయంతి సందర్భంగా ఆ మానవతావాది దేశ, సమాజ సేవలను స్మరించుకుందాం
 
నారా లోకేశ్ ...
సామాన్యుడిగా జన్మించి, నిరాడంబరంగా జీవించి, అసామాన్య విజయాలను అందుకున్న'మిస్సైల్ మ్యాన్' అబ్దుల్ కలాంగారి పేరు తలచుకుంటే చాలు మన సంకల్పబలం రెట్టింపు అవుతుంది. అబ్దుల్ కలాంగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్ఫూర్తిదాయక చరిత్రను మననం చేసుకుందాం.
 
సోము వీర్రాజు.. 
ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో మేరు శిఖరం, భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపిన మిస్సైల్ మ్యాన్, భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారి జన్మదినం సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ అంజలి ఘటిస్తున్నాము.
 
జనసేన పార్టీ ... 
భారత అణు వైజ్ఞానిక రంగాన్ని, క్షిపణుల పరిజ్ఞానాన్ని ఖండాతరాలకు చాటిచెప్పిన మిస్సైల్ మ్యాన్, భారత మాజీ రాష్ట్రపతికి జనసేన ఘననివాళులు.