శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (08:09 IST)

భారత్‌లోకి మూడో రకం వైరస్.. మహారాష్ట్ర - బెంగాల్‌లో గుర్తింపు!

భారత్‌ను కరోనా వైరస్ భయపెడుతోంది. వైరస్ రెండో దశ వ్యాప్తి ధాటికి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సునామీలా విరుచుకుపడింది. దీంతో లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. అలాగే, మృతుల సంఖ్య కూడా విపరీతంగా ఉంది. ఈ వైరస్ డబుల్‌ మ్యూటెంట్‌ (రెండు ఉత్పరివర్తనాలు చెందింది) వైరస్‌ వల్లనే దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో మూడు ఉత్పరివర్తనాలు (ట్రిపుల్‌ మ్యూటెంట్‌) చెందిన మరో కొత్త రకం వైరస్‌ తాజాగా వెలుగులోకి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వైర్‌సను పరిశోధకులు గుర్తించారు. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో ట్రిపుల్‌ మ్యూటెంట్‌ వైరస్‌ను గుర్తించినట్టు సమాచారం. 
 
ఈ వైరస్‌ మరింత వేగంగా వ్యాపిస్తుందని మెక్‌గిల్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ మధుకర్‌ పాయ్‌ చెప్పారు. వైరస్‌ జన్యు క్రమాన్ని వేగంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా వైర్‌సలో మార్పులకు అనుగుణంగా వ్యాక్సిన్‌లోనూ మార్పులు చేయాల్సి ఉంటుందని ప్రొఫెసర్‌ పాయ్‌ పేర్కొన్నారు. 
 
మనదేశంలో ఒకశాతం కంటే తక్కువ కేసుల్లోనే జన్యు క్రమ అధ్యయనాలు జరుగుతున్నందువల్ల కొత్త వైరస్‌ రూపాలను కనుక్కోవడం సవాలుగా మారిందని ఆయన తెలిపారు. ట్రిపుల్‌ మ్యూటెంట్‌ వైరస్‌ వ్యాప్తిని, తీవ్రతను అంచనా వేయాలంటే మరిన్ని జన్యు విశ్లేషణలు అవసరమని చెప్పారు.