సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (16:03 IST)

కరోనా వైరస్ నియంత్రణ కోసం మరో ఏడు వ్యాక్సిన్లు : మంత్రి వర్షవర్థన్

ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మరో ఏడు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం ఢిల్లీలో మాట్లాడుతూ, కరోనాను నియంత్రించేందుకు దేశంలో ఇప్పటికే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను అందుబాటులో ఉన్నాయన్నారు. 
 
ఇవికాకుండా, మరో ఏడు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కేవలం రెండు టీకాలపైనే ఆధారపడలేమన్నారు. భారత్‌ పెద్ద దేశం కావడంతో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించేలా పలు కంపెనీలు పరిశోధనలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ ఏడు వ్యాక్సిన్లలో మూడు క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని తెలిపారు. 
 
దేశంలోని ప్రతి ఒక్కరికి టీకా అందించేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వ్యాక్సిన్‌ను బహిరంగ మార్కెట్‌లో ఉంచేందుకు ప్రభుత్వం వద్ద తక్షణ ప్రణాళిక ఏమీ లేదన్నారు. ఈ అంశంపై డిమాండ్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. 50 ఏళ్లకు పైబడినవారికి కరోనా టీకా పంపిణీని మార్చిలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కొవిడ్‌ టీకాను అత్యవసర ప్రాతిపదికన పూర్తి పర్యవేక్షణలో అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.