గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (10:41 IST)

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం

kiran rijiju
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వాహనాన్ని ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టగా.. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. మంత్రి జమ్మూకాశ్మీర్‌ పర్యటనలో రామ్‌బన్‌ జిల్లా బనిహాల్‌ వద్ద జమ్మూ - శ్రీనగర్‌ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఉదంపూర్‌ సమీపంలో లోడుతో వెళ్తున్న ట్రక్కు బ్రేక్‌డౌనుకు గురైనట్లు అదనపు డీజీ ముకేశ్‌సింగ్‌ తెలిపారు. 
 
ప్రమాదం జరగ్గానే భద్రతా సిబ్బంది మెరుపువేగంతో స్పందించి కారు డోర్లు తెరిచి మంత్రిని బయటకు తీశారు. ఓ న్యాయసేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు జమ్మూకాశ్మీర్‌ వెళ్లిన కిరణ్‌ రిజిజు ఉదంపూర్‌ వరకు కారులో ప్రయాణించారు. 'ఈ అందమైన రహదారిని ఎవరైనా ఆస్వాదించవచ్చు' అంటూ విశాలమైన రోడ్డును చూపిస్తూ తీసిన వీడియోను ట్విటర్‌లో మంత్రి పోస్టు చేశారు. అంతలోనే ఇలా జరగడం యాదృచ్ఛికం.