శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (14:30 IST)

లాక్‌డౌన్ సడలింపుపై స్పష్టత .. షరతులతో కూడిన అనుమతులు : కిషన్ రెడ్డి

ఈ నెల 14వ తేదీతో ముగియనున్న లాక్‌డౌన్‌ను మరో 19 రోజుల పాటు పొడగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వెల్లడించారు. అంటే మే 3వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుంది. అయితే, ఈ నెల 20వ తేదీ తర్వాత లాక్‌డౌన్ సడలింపు ఉంటుందని ప్రధాని తన ప్రసగంగంలో పేర్కొన్నారు. 
 
ఏప్రిల్‌ 20 నుంచి అత్యవసర విషయాలకు కొన్ని ప్రత్యేక అనుమతులు ఉంటాయని ప్రధాని మోడీ ప్రకటించారు. అయితే, ఇందులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఆ అనుమతులను వెనక్కి తీసుకుంటామన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 20 నుంచి కొన్నింటికి షరతులతో కూడిన అనుమతులు ఉంటాయని వివరించారు. ఈ నెల 20 వరకు అన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాల్సిందేనని తెలిపారు. దేశవ్యాప్తంగా 46 జిల్లాల్లో ఇంతవరకూ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదన్నారు.
 
దేశంలో కరోనా కేసులు తీవ్రస్థాయిలో లేకపోయినప్పటికీ, పలు ప్రాంతాల్లో మాత్రం కేసులు అధికంగా ఉన్నాయని చెప్పారు. వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దవచ్చని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారు ఇళ్లల్లో సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఆయన చెప్పారు.
 
కాగా, లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో దేశంలోని అన్ని ప్యాసింజర్‌ రైళ్లను మే 3 అర్థరాత్రి వరకు రద్దు చేశారు. అలాగే, దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని కూడా మే 3 అర్ధరాత్రి వరకు నిషేధించారు.