ఆర్థిక సంవత్సరం జూన్ వరకూ ...
కరోనాతో అతలాకుతలం అవుతున్న ఆర్థిక వ్యవస్థల నేపథ్యంలో కేంద్రం భారత్ ఆర్థిక సంవత్సరాన్ని 3 నెలలు పొడిగించింది. దీనితో ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరం జూన్ వరకూ కొనసాగనుంది.
సాంప్రదాయకంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమై ఆ తదుపరి ఏడాది మార్చి 31తో పూర్తవుతుంది. అంటే 12 నెలల పాటు ఆర్థిక సంవత్సరం కొనసాగుతుంది. కేంద్రం తాజా నిర్ణయం నేపథ్యంలో 15 నెలలపాటు ఈ ఆర్థిక సంవత్సరం కొనసాగనుంది.
‘‘2020–21 ఆర్థిక సంవత్సరం 2020 ఏప్రిల్ నుంచీ కాకుండా 2020 జూలై 1వ తేదీ నుంచీ ప్రారంభమవుతుంది’’ అని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ప్రభుత్వ గణాంకాల నుంచి పారిశ్రామిక గణాంకాల వరకూ అన్ని విభాగాలపై కరోనా ప్రభావం నిర్దిష్ట కాల వ్యవధిలో ఏ మేరకు ఉందన్న అంశాన్ని కొంతమేర ఒక అంచనాకు రావడానికి తాజా నిర్ణయం దోహపడుతుందన్నది నిపుణుల విశ్లేషణ.
ఆర్థిక సంవత్సరాన్ని మూడు నెలల పాటు కొనసాగించాలని పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వాన్ని గత కొన్ని రోజులుగా కోరుతున్నాయి. కరోనా వైరస్ కల్లోలంతో కనీసం ఆరు నెలల పాటు ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని ఈ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.
గత ఏడాది 2019 నుంచి ఈ ఏడాది మార్చి వరకూ ఉండే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీల వార్షిక నివేదికలు పూర్తి బిజినెస్ సైకిల్‌ను ప్రతిబింబించలేవని వివరించారు.