మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (19:48 IST)

ప్రజాతీర్పుతో విపక్షాల నోటికి తాళం : యోగి ఆదిత్యనాథ్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో విపక్షాల నోటికి తాళం పడిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌తో పాటు మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 
 
ఈ ఫలితాల తర్వాత సీఎం యోగి స్పందించారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ అద్భుత విజయం సాధించిందన్నారు. ఈ ప్రజాతీర్పుతో విపక్షాల నోటికి తాళం పడిందన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ చేసిన అసత్య ప్రచారానికి ఓటర్లు విస్పష్ట తీర్పును ఇచ్చారన్నారు. బీజేపీకి ఘన విజయం కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు. ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో యూపీ మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. 
 
కాగా ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయభేరీ మోగించింది. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి రానుంది. అలాగే, యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏడు దశల్లో జరిగిన యూపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం చేపట్టిన విషయం తెల్సిందే.