శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (10:19 IST)

మ్యాచ్ వివాదం : ట్విట్టర్ ఇండియా ఎండీపై యూపీలో కేసు

ప్రముఖ సామాజిక మాద్యమ సంస్థ ట్విట్టర్‌కు కష్టాలు తప్పడం లేదు. భారత మ్యాప్‌ను తప్పుగా చూపించినందుకు ఆ సంస్థకు చెందిన భారత విభాగం ఎండీ మనీష్ మహేశ్వరిపై కేసు నమోదైంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్‌ ప్రాంతాలను వేరే దేశంగా మ్యాప్‌లో చూపించారు. దీనిపై ట్విట్టర్ ఇండియన్ ఎండీతో పాటు ఉన్నతాధికారులపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు. 
 
అంతకుముందు భారత మ్యాపును తప్పుగా చూపిస్తూ వక్రబుద్ధిని ప్రదర్శించిన ఈ సామాజిక మాధ్యమం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ప్రభుత్వం సహా దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం కావడంతో మ్యాపును వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది.
 
జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌‌లను భారత్‌ వెలుపల ప్రాంతాలుగా చూపుతూ ట్విట్టర్‌ తన వెబ్‌సైట్లో ట్వీప్‌ లైఫ్‌ అనే సెక్షన్‌లో తప్పుడు మ్యాపును ఉంచింది. దీంతో ట్విట్టర్‌పై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది.
 
దేశ మ్యాపును తప్పుగా చూపించడం చట్టరీత్యా నేరమని.. దీనికి భారీ జరిమానాతో పాటు దేశంలోని సంస్థ అధికారులు జైలు శిక్ష కూడా అనుభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలోనూ ఈ తరహా తప్పిదాలకు పాల్పడిన ట్విట్టర్‌ను ఈసారి గట్టిగానే హెచ్చరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.