బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 మార్చి 2020 (22:00 IST)

ఆసుపత్రులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోండి: కరోనాపై కేబినెట్ కార్యదర్శి

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండి అవసర‌మైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.

ఈ మేరకు మంగళవారం ఆయన ఢిల్లీ నుండి కరోనా వైరస్ పై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గౌబ మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ విషయంలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య,సంబంధిత శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించాలని చెప్పారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ను నోడల్ అధికారిగా నియమించాలని తెలిపారు.

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇతర విభాగాలతో మెరుగైన రీతిలో సమన్వయంతో పనిచేయాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ స్పష్టం చేశారు. ఎక్కడైనా కరోనా వైరస్ కు సంబందించిన లక్షణాలు గల వ్యక్తులను గుర్తిస్తే వెంటనే ఐసోలేషన్ వార్డులలో చేర్చి తగిన వైద్యం అందించాలని ఆదేశించారు.

కరోనా వైరస్ కు సంబంధించి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించేందుకు స్థానిక ఎఫ్ యం రేడియో, కేబుల్ నెట్ వర్క్,ఇతర మీడియాను పూర్తిగా వినియోగించు కోవాలని చెప్పారు.

కరోనా వైరస్ పై ఈనెల 6వ తేదీన జాతీయ స్థాయిలో ఢిల్లీ లో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నామని, దీనికి అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య ముఖ్య అధికారులు హాజరు కావాలని ఆదేశించారు. అలాగే ఈ నెల 9న రాష్ట్రాల స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.

అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు వాటిలో గల సౌకర్యాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రాలకు అవసరమైన మాస్క్ లను సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం లో తగిన తోడ్పాటును అందిస్తుందన్నారు.

కరోనా వైరస్ పై వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని పేర్కొన్నారు. వీడియో సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి,ఎపిఎంహెచ్ఐడిసి ఎండి వి.విజయరామ రాజు,ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.