గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 మే 2021 (13:05 IST)

రెండో ఎక్కం చెప్పమన్న వధువు.. నీళ్లునమిలిన వరుడు... తర్వాత ఏం జరిగిందంటే..

సాధారణంగా వివాహాల సమయంలో వరుడు లేదా అత్తింటివారు గొంతెమ్మ కోర్కెలు కోరుతుంటారు. పైగా, వరుడు ఎలా చెబితే అలా వధువు తరపు వారు నడుచుకోవాల్సివుంటుంది. పెళ్లి విషయంలో వధువు ఇష్టాయిష్టాలకు తావులేదు. అలాకాకుంటే ఆ పెళ్లి జరగదు. ఒకవేళ వధువును బలవంతంగా ఒప్పించినప్పటికీ.. పలు పెళ్లిళ్లు పెళ్లి పీటలపై ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 
 
అయితే, ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి చాలా మేరకు మారిపోతోంది. పెళ్లి కూతురు తనకి కావలసింది ఏమిటో ఖచ్చితంగా చెబుతోంది. కొన్ని చోట్ల వరుడు తనకు సరిపోడు అనిపించినపుడు నిష్కర్షగా తన అభిప్రాయం చెప్పి ఆ పెళ్లిని వదులుకోవడానికి సిద్ధం అవుతున్నారు నేటి యువతులు. వారికి అండగా కుటుంబ సభ్యులు కూడా అండగా నిలబడుతున్నారు. 
 
తాజాగా అక్షరం ముక్కరాని, పూర్తిగా నిరక్షరాస్యుడైన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు ఓ యువతి నిరాకరించింది. పెళ్లి పీటలపై నుంచి లేచి వెళ్లిపోయింది. దీంతో ఆ పెళ్లి ఆగిపోయింది. 
 
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విద్యావంతురాలైన యువతికి మహోబా జిల్లాలోని ధవార్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. శనివారం సాయంత్రం అందరూ పెళ్లి మండపానికి చేరుకోగా.. పురోహితుడు పెళ్లి తంతు మొదలు పెట్టాడు. అయితే, పురోహితుడు చెబుతున్న మంత్రాలను ఈ పెళ్ళికొడుకు తిరిగి చెప్పడంలో తడబాటు పడుతున్నాడు. 
 
ఒక్క మంత్రమూ సరిగా పలకలేక పోతున్నాడు. దీంతో వధువుకు అనుమానం వచ్చింది. పురోహితుడిని మంత్రాలు చదవడం ఆపమని కోరింది. పెళ్ళికొడుకును మీరెంత వరకూ చదివారు అంటూ ప్రశ్నించింది. దీంతో అతను నీళ్ళు నమిలాడు. వెంటనే, పెళ్ళికూతురు ఆ పెళ్ళికొడుకును రెండో ఎక్కం అప్పచెప్పమని అడిగింది. అంతే ఆయన గారి బండారం బయటపడింది.
 
దీంతో వధువుకు పిచ్చి కోపం వచ్చింది. నేను ఈ పెళ్లి చేసుకోను అంటూ ఖచ్చితంగా చెప్పి పెళ్లి మండపం నుంచి కిందకు దేగేసింది. దీంతో బంధువులు అందరూ షాక్ తిన్నారు. ఇరువైపుల పెద్దలూ ఆమెకు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. కానీ, దానికి ఆమె ఒప్పుకోలేదు. రెండో ఎక్కం చెప్పడం రానివాడిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రశ్నించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె నిర్ణయమే కరెక్ట్ అని పెళ్లిని రద్దు చేసుకున్నారు.