శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మార్చి 2020 (14:38 IST)

తాగిన మైకంలో మనిషి మాంసంతో కూర... ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ తాగుబోతు పీకలవరకు మద్యం సేవించాడు. దీంతో కైపు నషాళానికెక్కింది. ఈ మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నాడనే విషయం మరిచిపోయాడు. దీంతో నేరుగా శ్మశానానికి వెళ్లి... ఓ మృతదేహం చేతిని నరికి ఇంటికి తెచ్చాడు. ఆ చేయి మాంసంతో కూర చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్ టిక్కోపూర్ అనే గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బిజ్నూర్‌ టిక్కోపూర్‌ గ్రామానికి చెందిన సంజయ్‌(32) అనే పచ్చి తాగుబోతు. నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులను హింసిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో అతనో సైకోగా ప్రవర్తిస్తూ వచ్చాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇటీవల తండ్రిపై కూడా దాడిచేసి గాయపరిచాడు. 
 
అయితే సోమవారం మధ్యాహ్నం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న స్మశానవాటికకు వెళ్లాడు. అక్కడ ఓ మృతదేహం చేయిని ఇంటికి తీసుకొచ్చాడు. చేతి వేళ్లను వేరుచేసి, మాంసాన్ని తీసి కూరవండాడు. 
 
ఈ విషయాన్ని భార్య గమనించి తీవ్ర భయాందోళనకు గురైంది. ఇరుగుపొరుగు వారితోపాటు పోలీసులకు ఆమె సమాచారం చేరవేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.