శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (15:48 IST)

జీన్స్ - టైట్ ఫిట్టింగ్స్ వేసుకుంటే గ్రామ బహిష్కరణ : బగ్‌పత్ పంచాయతీ పెద్దల తీర్పు

ఉత్తరప్రదేశ్‌లో అమ్మాయిల‌పై లైంగికదాడులు, అత్యాచారాల ఘట‌న‌లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని బగ్‌పత్ గ్రామంలో కట్టుబాట్లు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ ఊరిలో పంచాయ‌తీ పెద్ద‌లు ఏది చెపితే అది చేయాలి. పంచాయితీ ఏం చెపితే అదే వేదం. ఈ తీర్పును ఎవ‌రైనా అతిక్ర‌మిస్తే వారికి గ్రామ బ‌హిష్క‌ర‌ణ‌ తప్పదు. వారిని ఇక గ్రామంలోకి అడుగు పెట్ట‌కుండా చేస్తారు.
 
బగ్‌పత్ గ్రామంలో పంచాయితీ అధికారులు ఈ మధ్య అమ్మాయిల వస్త్రధారణ విషయంలో సంచలన తీర్పునిచ్చారు. అదేంటంటే పద్ధతిగా ఉండాల్సిన  యువతులు టైట్ క్లాత్స్, జీన్స్ ప్యాంట్లను ఎక్కువగా ధరిస్తున్నారని పంచాయితీ పెద్దల దృష్టికి వెళ్ళింది. దీంతో ఆగ్రహించిన పంచాయతీ పెద్దలు అమ్మాయిల‌ను పిలిపించి వారు జీన్స్ ప్యాంట్లను ధరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. గ్రామంలో ఏ ఒక్క అమ్మాయి జీన్స్ వేసుకుని గానీ, టైట్ ఫిట్టింగ్స్ వేసుకుంటే ఆ కుటుంబం మొత్తాన్ని ఊరి నుంచి తరిమేస్తామని తీర్పునిచ్చింది.
 
అయితే ఈ తీర్పును కొంతమంది మాత్రమే ఆమోదిస్తున్నారు. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమ్మాయిల వ్యక్తిగత జీవితాన్ని కూడా పంచాయితీ పెద్దలు నిర్దేశించడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం పాశ్చాత్య సంస్కృతిని పారద్రోలేందుకే ఈ తీర్పును ప్రకటించినట్లు సమర్థించుకుంటున్నారు. ఈ తీర్పు తమ గ్రామంలోనే కాకుండా, భారతదేశం మొత్తం అమలుచేస్తే బాగుంటుందని పంచాయతీ పెద్దలు ఆశిస్తున్నారు.