మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (10:44 IST)

25 ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టీకాల పంపిణీ

దేశంలో ఈ నెల 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ వ్యాక్సినేషన్‌లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానాన్ని ఆక్రమించింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను క్రమంగా పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలో మంగళవారం నుంచి 1,034 కేంద్రాల్లో టీకాలు ఇస్తోంది.
 
అలాగే, ప్రతీ కేంద్రంలో రోజుకు వంది మంది చొప్పున టీకాలను ఇచ్చే ఏర్పాట్లు జరిగాయని, ఈ వారంలోనే ప్రభుత్వ హెల్త్ కేర్ సిబ్బంది మొత్తానికి అందిస్తామని ధీమా వ్యక్తం చేసింది. రోజుకు సగటున లక్ష మందికిపైగా వ్యాక్సిన్ ఇవ్వాలని అంచనా వేశామంటోంది. 
 
ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే సోమవారం (జనవరి 25) నుంచి వంద పడకలకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తామని వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. 
 
తొలి రోజు కేవలం 140 కేంద్రాల్లో 30 మంది చొప్పున 3,962 మందికి వ్యాక్సిన్ ఇచ్చిన వైద్యారోగ్య శాఖ సోమవారం 13,666 మందికి ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 17,628 మందికి ఇచ్చినట్లయింది. 
 
రాష్ట్రంలో మొత్తం 1,119 ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న 1.25 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తయిన తర్వాత ప్రైవేట్ రంగంలోని 6,106 ఆసుపత్రుల్లోని సుమారు రెండు లక్షల మంది సిబ్బందికి ఇవ్వనున్నట్లు ఆ అధికారి తెలిపారు. ఈ వారంలోనే సుమారు మూడున్నర లక్షల డోసులు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.