శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (16:08 IST)

కాలం మారుతున్నా అది మారట్లేదు... కేరళలో ఆయుర్వేద డాక్టర్ ఆత్మహత్య

Vismaya
కాలం మారుతున్నా వరకట్నం వేధింపులు తగ్గట్లేదు. వరకట్నం వేధింపుల కారణంగా మహిళలు బలవుతూనే వున్నారు. తాజాగా కేరళలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొల్లాం జిల్లా సస్తంకొట్ట ప్రాంతానికి చెందిన ఎస్ కిరణ్ కు విస్మయ వి నాయర్ (23) అనే ఆయుర్వేద డాక్టర్‌కు మార్చి 2020లో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది.
 
అల్లుడు ఆర్టీఏలో ఇన్‏స్పెక్టర్‌గా పనిచేస్తుండడంతో ఆమె తల్లితండ్రులు కట్నం కింద 100 సవర్ల బంగారం, ఎకరానికి పైగా భూమి, కారును కట్నంగా అందించారు. కానీ పెళ్లైన కొద్ది రోజులకే విస్మయకు అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. కారుకు బదులుగా డబ్బులు కావాలని భర్త, అత్తమామలు విస్మయను చిత్రహింసలు పెట్టేవారు. తనను తన భర్త, అత్తమామలు రోజూ చిత్రహింసలు పెడుతున్నారని తన తల్లికి చెప్పుకునేది విస్మయ.
 
ఆ తర్వాత కొద్ది రోజులకు తన కజిన్ కు తనను భర్త కొడుతున్నాడంటూ మెసేజ్ చేసింది. తనను జుట్టు పట్టుకుని ఈడ్చి ముఖంపై కొట్టాడని గాయాలను చూపిస్తూ ఫోటోలు పంపింది. తనను కిరణ్ కొట్టిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని తాను కూడా ఎవరికీ చెప్పలేదని ఆ మెసేజ్‌ల్లో విస్మయ తెలిపిందని వెల్లడించారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే విస్మయ ఆత్మహత్య చేసుకుంది. 
 
అయితే విస్మయ ఆత్మహత్య చేసుకుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె తన అన్నకు పంపించిన మెసేజ్‏లు, ఫోటోలు బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది. అందులో ఆమె మొహం, చేతులపై గాయాలున్నాయి. దీంతో తమ కూతురిని భర్త అత్తమామలే చిత్రహింసలు పెట్టి చంపేశారంటూ విస్మయ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
ఈ క్రమంలో మంగళవారం పోలీసులు విస్మయ భర్తను అదుపులోకి తీసుకున్నారు. విస్మయ భర్తపై ఐపీసీ సెక్షన్ 304 బీ కింద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రాష్ట్ర రవాణా శాఖ సర్వీస్ నుంచి కిరణ్‌ను సస్పెండ్ చేశారు. అటు విస్మయ ఘటన కేరళ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.