గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 మార్చి 2018 (09:08 IST)

జయలలిత స్నేహితురాలు శశికళ భర్త నటరాజన్ కన్నుమూత...

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రియనెచ్చెలి శశికళ భర్త ఎం.నటరాజన్ కన్నుమూశారు. ఆయనకు వయసు 74 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రియనెచ్చెలి శశికళ భర్త ఎం.నటరాజన్ కన్నుమూశారు. ఆయనకు వయసు 74 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన  చెన్నైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. 
 
గత యేడాది అక్టోబరు నెలలో ఆయనకు మూత్రపిండాలతో పాటు కాలేయ మార్పిడి చికిత్స జరిగిన విషయం తెల్సిందే. ఇపుడు మళ్లీ ఇదే సమస్య తలెత్తడంతో రెండు వారాల నుంచి చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, ఆయన మంగళవారం తెల్లవారుజామున 1.35 గంటలకు నటరాజన్ మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 
 
గతంలో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసిన నటరాజన్‌.. 1975లో శశికళను వివాహం చేసుకున్నారు. అంతేకాక జయలలితకు కొన్నాళ్ల పాటు రాజకీయ సలహాదారుగానూ ఆయన వ్యవహరించారు. చెన్నై బీసెంట్‌నగర్‌లోని తన నివాసానికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు. 
 
మరోవైపు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను చూసేందుకు శశికళ సోమవారం పెరోల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఇంతలోనే విషాదం జరిగింది. భర్త మరణవార్తను తెలుసుకున్న ఆమె విషాదంలో మునిగిపోయారు. 
 
పెరోల్ రాగానే ఆమె బెంగుళూరు పరప్పన్ జైలు నుంచి చెన్నైకు రానుంది. నటరాజన్ అంత్యక్రియలు బుధవారం జరుగనున్నాయి. కాగా, శశికళ అక్రమంగా ఆస్తుల సంపాదన కేసులో బెంగుళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెల్సిందే.