బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (16:51 IST)

కోవిడ్19 పై యుద్ధం.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా? (video)

రోజురోజుకు కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. ఒకవైపు పెరుగుతున్న కేసులు, మరణాల సంఖ్యతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. 
 
ఈ కరోనా కాలంలో మాస్కు ధరించడం ఒక్కటే మార్గం కాదు. అన్నింటికంటే కరోనాను ఎదుర్కొనేందుకు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు యోగ సాధన ద్వారా కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. 
 
ముఖ్యంగా మన ప్రాచీన భారతీయ ఆరోగ్య విద్య అయిన యోగ విద్య ద్వారా రోగ నిరోధక శక్తి పెంచుకుని కరోనాను ఎదుర్కొనవచ్చంటున్నారు యోగా సాధకులు. 
 
ఆధునిక సైన్స్‌ కూడా మన యోగాసనాల ప్రయోజనాలను నిర్ధారించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించింది. అందరూ యోగా ద్వారా స్వస్థత పొందాలని సూచించింది. 
 
ఈ నేపథ్యంలో  కరోనాను అడ్డుకునేందుకు, రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు యోగాసనాలు ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో సలంబ భుజంగాసనం, పరివృత్త ఉత్కటాసనం, అనువిత్తాసన, గరుడాసనం, త్రికోణాసనం, ఆనంద బాలాసనం వంటి యోగాసనాలు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. 
 
1. సలంబ భుజంగాసనం
సలంబ భుజంగాసనం నేరుగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. బొక్కబోర్లా పడుకుని నడుము పైభాగాన్ని నిటారుగా ఉంచడం ఈ ఆసనంలోని ముఖ్యాంశం. ఈ క్రమంలో ముంజేతుల వరకు నేలపై ఆనించి ఉంచాలి. ముక్కు ద్వారా ఊపిరిపీల్చాలి. నోటి ద్వారా వదలాలి.
 
2. పరివృత్త ఉత్కటాసనం
పరివృత్త ఉత్కటాసనం సాధారణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండాలు, జీర్ణావయవాలను మెలితిప్పడం ద్వారా శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. కాళ్లను కొద్దిగా వంచి చేతులు జోడించి నడుము భాగాన్ని ఒకవైపునకు తిప్పి పైకి చూడటం ఈ యోగాసనంలో కనిపిస్తుంది. మోచేతులను తొడలకు తాకుతూ ఉండాలి. సాధారణ స్థితికి వచ్చే సమయంలో ఊపిరి వదలాలి.
 
3. అనువిత్తాసనం
అనువిత్తాసనం.. ఇది శరీరంలోని కొన్ని గ్రంథులను శుద్ధి చేస్తుంది. శ్వాసవ్యవస్థను చైతన్యపరిచేందుకూ ఈ యోగాసనం పనికొస్తుంది. నడుము కింది భాగంలో రెండు చేతులు ఉంచుకుని వీలైనంత వరకూ వెనక్కి వంగడమే ఈ అనువిత్తాససనం. ఊపిరి తీసుకుంటూ వెనక్కి వంగడం.. అదే స్థితిలో కొంత సమయం ఉండటం ఆ తరువాత ఊపిరి వదులుతూ నెమ్మదిగా సాధారణ స్థితికి రావడం ఈ ఆసన క్రమం.
 
4. గరుడాసనం
గ్రద్ద ఎలా నిలబడుతుందో అలా నిలబడటం అన్నమాట. ఈ ఆసనం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది మరియు ఏకాగ్రత పెరుగుతుంది. మనలో భావోద్రేకాలను నియంత్రించుకోవచ్చు. 
 
ఈ ఆసనంలో ఒకే అంశం మీద మనసు లగ్నం చేయాలి. ఇది ఒత్తిడిని నియంత్రించడానికి బాగా ఉపయోగ పడుతుంది. భుజాలు, తుంటి భాగంలోని కండరాలు రిలాక్స్ అయ్యేందుకు కూడా సాయపడుతుంది.
 
5. త్రికోణాసనం
ఈ ఆసనం జీర్ణశక్తిని మెరుగు పరచడమే కాక పొట్ట, నడుము దగ్గర పేరుకుపోయిన కొవ్వుని కరిగిస్తుంది. ఈ ఆసనం వల్ల శరీరం సమతూకంగా ఉంటుంది.
 
పైన సూచించిన ఆసనాలతోపాటు రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) పెంచుకునేందుకు ప్రయత్నించాలి. మనలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటే వైరస్‌లు, ఇతర వ్యాధులను కూడా సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పరిధిలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, కాయలు, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు సమృద్ధిగా దొరుకుతాయని తెలిపారు. 
 
* తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా (ప్రతి వ్యక్తి రోజుకు 450 నుంచి 500 గ్రాముల వరకు) తినాలి. తృణధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. స్థానికంగా పండే ధాన్యాలు, ఆయా సీజన్లలో దొరికే పండ్లలో ఈ పోషకాలు లభిస్తాయి.
 
* అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి.
 
* ఈ సమయంలో కార్బోనేటేడ్ శీతల పానీయాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. వాటిలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్ లాంటి ముఖ్యమైన   పోషకాలు తక్కువగా ఉంటాయి.
 
* మాంసం, గుడ్లు తినడం ప్రమాదమేమీ కాదు. బాగా ఉడికించిన మాంసాన్నే తినాలి. అయితే పచ్చి మాంసం, గుడ్లు, కూరగాయలను పట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
 
* తరచూ మంచి నీళ్లు తాగుతుండాలి. ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారిలో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది.  ఆ అలవాట్లు ఉన్నవారికి అంటువ్యాధుల ముప్పు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అలవాట్లను మానుకోవాలి.