శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2023 (15:57 IST)

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రాజెడీ : ఐదుగురు అధికారులపై వేటు

train tragedy
ఒరిస్సా రాష్ట్రంలోని బాలాసోర్ సమీపంలోని బహనగ బజార్ వద్ద షాలిమార్ - చెన్నై సెంట్రల్ ప్రాంతాల మధ్య నడిచే కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 2వ తేదీన ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 292 మంది చనిపోయారు. వెయ్యి మందికి వరకు గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటన వెనుక కుట్ర కోణంపై సీబీఐ విచారణ జరుపుతుంది. ఒకవైపు సీబీఐ విచారణ కొనసాగుతుండగానే ప్రమాదం జరిగిన మూడు వారాల తర్వాత పలువురు అధికారులపై రైల్వే బోర్డు చర్యలు తీసుకుంది. వీరిలో సౌత్ ఈస్టర్న్ రైల్వేస్‌కు చెందిన ఐదుగురు ఉన్నారు.
 
సిగ్నలింగ్, ఆపరేషన్స్, సేఫ్టీ విభాగాలను చూసే ఈ ఐదుగురిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. బదిలీ వేటు పడిన వారిలో ఖరగ్‌పూర్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) ఘజాత్ హష్మీ, ఎస్ఈఆర్ జోన్ ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీర్ పీఎం సిక్దర్, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ చందన్ అధికారి, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ డీపీ కాసర్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియ్ ఆఫీసర్ ఉన్నారు. ఈ మేరకు రైల్వే బోర్డు శుక్రవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఇవి సాధారణ బదిలీనని రైల్వే బోర్డు చెబుతున్నప్పటికీ ప్రమాదం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.