సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (17:01 IST)

నా చావును కోరుకుంటున్న అమిత్ షా : మమతా బెనర్జీ ఫైర్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోమారు విమర్శలు గుప్పించారు. తన చావును హోం మంత్రి అమిత్ షా కోరుకుంటున్నారంటూ మండిపడ్డారు. తనను గాయపడేలా చేసిన అమిత్‌ షా తన చావును కోరుకుంటున్నారని అన్నారు. పుర్బ వర్ధమాన్‌లో శుక్రవారం జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
పోలింగ్‌ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్‌లో ప్రచారం చేపట్టినా ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఈసీ ఇంతవరకూ వెల్లడించలేదని దీదీ ఎన్నికల కమిషన్‌ తీరును దుయ్యబట్టారు. 
 
కాగా నందిగ్రామ్‌లో నామినేషన్‌ వేసిన తర్వాత కొందరు వ్యక్తులు తనపై దాడి చేయడంతో తన కుడి కాలుకు గాయమైందని మమతా బెనర్జీ మార్చి 10న ఆరోపించిన సంగతి తెలిసిందే. కాలికి గాయం అనంతరం దీదీ వీల్‌ ఛైర్‌లోనే ఎన్నికల ప్రచార ర్యాలీలకు హాజరవుతున్నారు.
 
బలగాలనే అవమానిస్తారా? ఈసీ ఆగ్రహం 
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మరో నోటీసు ఇచ్చింది. పోలింగ్ బూత్‌ల వద్ద విధులు నిర్వర్తిస్తున్న కేంద్ర పారామిలటరీ బలగాల మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బలగాలను అవమానిస్తారా? అంటూ మండిపడిన ఈసీ..  ఈ నెల 10లోపు వివరణ ఇవ్వాల్సిందిగా మమతను ఆదేశించింది.
 
మార్చి 28న నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా.. కేంద్ర పారామిలటరీ బలగాలకు అన్ని అధికారాలు ఎవరిచ్చారంటూ మమత ప్రశ్నించారు. మహిళలను ఓటేయకుండా బెదిరించారని, ఆ అధికారం వారికెక్కడిదని ప్రశ్నించారు. 2016, 2019లోనూ ఇలాగే జరిగిందని ఆరోపించారు. 7న హూగ్లీ జిల్లాలో నిర్వహించిన ప్రచారంలో మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
 
కేంద్ర బలగాలు అమిత్ షా ఆదేశాలతో పనిచేస్తున్నాయని, గ్రామస్థులపై అరాచకాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. మహిళలపైనా వేధింపులకు పాల్పడుతున్నారని, బీజేపీకి ఓటేయాలంటూ వారు ఒత్తిడి చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలపై మండిపడిన ఎన్నికల సంఘం.. రెచ్చగొట్టే విధంగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ తాజా నోటీసుల్లో వ్యాఖ్యానించింది. 
 
కేంద్ర బలగాలను తిట్టడం, వారిని అవమానించడం మంచిది కాదని పేర్కొంది. దాని వల్ల బలగాల్లో మనోస్థైర్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది. కాగా, ముస్లింలంతా తృణమూల్ కే ఓటేయాలన్న మమత వ్యాఖ్యలపై అంతకుముందు బుధవారం ఈసీ నోటీసులిచ్చింది. ఇపుడు మరో నోటీసు జారీచేసింది. రెండు రోజుల వ్యవధిలో ఆమెకు అందిన రెండో నోటీసు ఇది. మార్చి 28, ఏప్రిల్ 7న మమత చేసిన ప్రసంగాలను ప్రస్తావిస్తూ.. వాటిపై రేపు ఉదయం 11 గంటల కల్లా వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
 
భాజపా అభ్యర్థి కాన్వాయ్‌పై దాడి..
దక్షిణ హౌరా భాజపా అభ్యర్థి రంతిదేవ్ సేన్‌గుప్తా కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు గురువారం దాడికి పాల్పడ్డారు. ‘నా వాహనంపై దాడికి పాల్పడిన వ్యక్తులు ఖేలాహోబ్ అంటూ నినాదాలు చేశారు. ఆ పార్టీ ఓటమిని అంగీకరించింది కాబట్టే..ఇలాంటి దాడులకు పాల్పడుతోంది’ అంటూ తృణమూల్‌ను ఉద్దేశించి గుప్తా విమర్శలు చేశారు.