బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 జులై 2017 (17:18 IST)

గుజరాత్‌లో తమిళనాడు సీన్.. రిసార్ట్‌లో 44 మంది ఎమ్మెల్యేలు.. అమిత్ షా ఫైర్

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన పిమ్మట.. తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అమ్మ నెచ్చెలి శశికళ తమిళనాడు సీఎం కావాలనుకుంది. అయితే రెబల్ నేతగా మారిపోయిన మాజీ సీఎం పన

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన పిమ్మట.. తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అమ్మ నెచ్చెలి శశికళ తమిళనాడు సీఎం కావాలనుకుంది. అయితే రెబల్ నేతగా మారిపోయిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఆమెను సీఎం పీఠం ఎక్కనివ్వలేదు. దీంతో పాటు అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ అరెస్టు కాకముందు అన్నాడీఎంకేలో వర్గాల పొగ పెట్టింది. ఫలితంగా బలపరీక్ష కోసం తనకు మద్దతు తెలిపే ఎమ్మెల్యేలను ఓ రిసార్ట్‌లో ఉంచింది. దీంతో పళని సామి సీఎం అయ్యారు.
 
ఓపీఎస్ రెబల్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా గుజరాత్‌లోనూ ఇదే సీన్ రిపీటైంది. గుజరాత్‌లోని 44 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ బెంగళూరు తరలించింది. అక్కడ ఉన్న రిసార్ట్‌లో పెట్టి తాళం వేసింది. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా మండిపడ్డారు. రిసార్ట్‌లో పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు తాళం వేసిందని.. సొంత ఎమ్మెల్యేలను కూడా ఆ పార్టీ ఎందుకు స్వేచ్ఛగా తిరగనివ్వడం లేదని అడిగారు. 
 
గుజరాత్‌లోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ అక్రమంగా కొనుగోలు చేస్తోందని, రాజ్యసభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తమను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు అమిత్ షా కౌంటరిచ్చారు. కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్కరు ఎవరికి వారే ప్రధానమంత్రిగా భావించుకుంటారని... కానీ, ఏ ఒక్కరినీ ప్రధానిని చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉండదని ఎద్దేవా చేశారు.