అక్రమవలసదారుల ఏరివేతకు చర్యలు.. త్వరలో ఎన్.ఆర్.సి అమలు : అమిత్ షా
దేశంలో అక్రమంగా నివిసిస్తున్న వారిని ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం జాతీయ పౌర జాబితా (ఎన్.ఆర్.సి)ని అమలు చేసే విషయంపై హోం మంత్రి అమిత్ షా కసరత్తులు చేస్తున్నారు. ముందస్తు సన్నద్ధతలో భాగంగానే దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల కోసం నిర్బంధ కేంద్రాలను (డిటెన్షన్ సెంటర్లను) సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే అంశంపై అమిత్ షా తాజాగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నిర్బంధ ప్రక్రియకు సంబంధించిన విచారణ ప్రక్రియను విదేశీయుల ట్రిబ్యునళ్లు(ఎఫ్‌టీ) నిర్వహిస్తాయి. ప్రభుత్వం చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి. ఎఫ్‌టీలకు సంబంధించిన న్యాయ ప్రక్రియ ఇప్పుడే మొదలైంది' అని ఆయన వ్యాఖ్యానించారు.
అక్రమ వలసదారుల నిర్బంధం కోసం కర్ణాటకలో ఇదివరకే నిర్బంధ కేంద్రాన్ని నిర్మించారనీ, మహారాష్ట్రలోని నవీ ముంబైలో మరో కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని ఎంపికచేశారని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీనే అధికారంలో ఉన్న విషయం తెల్సిందే. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తు.చ తప్పకుండా పాటించాయి.
2024 సార్వత్రిక ఎన్నికల సమయం నాటికి దేశవ్యాప్తంగా ఎన్నార్సీని పూర్తిచేస్తామన్నారు. అక్రమ వలసదారులుగా తేలినవారిని ఏం చేస్తారని ప్రశ్నించగా.. చట్ట ప్రకారం చర్యలు చేపడుతామని బదులిచ్చారు. (బంగ్లాదేశ్‌కు చెందిన) అక్రమ వలసదారులను వెళ్లగొడతామని బీజేపీ పేర్కొంటున్నప్పటికీ.. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ వారిని తమ దేశంలోకి అనుమతించడానికి అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అక్రమ వలసదారుల పరిస్థితి ఏమిటన్న దానిపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.