గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (08:17 IST)

కరోనా కాలం.. శీతాకాలం మరింత అప్రమత్తత అవసరం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారినుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు కనిపిస్తోంది. విడతలవారీగా అన్ లాక్ ప్రక్రియల్లో భాగంగా ప్రస్తుతం సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనజీవనం కూడా దాదాపు మామూలు పరిస్థితికి వచ్చింది.

అయితే కరోనా ముప్పు మాత్రం ఇప్పటికీ పూర్తిగా తొలగిపోలేదని వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గినట్టు అనిపించినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా ప్రారంభ దశలో తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస పీల్చడంలో ఇబ్బంది, రుచి, వాసన కోల్పోవడంలాంటి లక్షణాలు ఉండేవి.

కానీ, ప్రస్తుతం చలికాలం కావడంతో ఈ కాలంలో మామూలుగా అందరికీ జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు వస్తుంటాయి. ఇవి సాధారణ సమస్యలు అనుకుని అంత ఈజీగా తీసిపారేయకూడదు. ఎందుకంటే ఎలాంటి లక్షణాలు లేకుండానే మళ్లీ కరోనా వైరస్‌ అందరిలో సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి ఒకరికి ఒకరు కనీస దూరాన్ని పాటించడంతోపాటు తప్పనిసరిగా మాస్క్‌ వాడడం, శానిటేషన్‌తోనే కరోనా బారినుంచి తప్పించుకునే అవకాశాలు ఉందని వైద్యులు చెబుతున్నారు.
 
స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష
ప్రస్తుతం కరోనా ముప్పు నుంచి మన దేశం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇందుకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తే ఎలాంటి సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా ప్రజలు బయటికి వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. శానిటైజర్‌ను తమ వెంట తప్పకుండా ఉంచుకోవాలి.

ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేందుకు భౌతిక దూరాన్ని పాటించాలి. వీటితో పాటు బయటి ఆహారం తినకుండా ఇంట్లో వండిన వేడిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.
 
బీపీ, షుగర్‌ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఇంట్లో ఉండడం మంచిది. అవసరమైతే తప్ప బయటికి రాకూడదు. గర్భిణులు పూర్తిగా ఇంట్లో ఉండి తగు జాగ్రత్తలు పాటించాలి. ఎవరికైనా జలుబు వచ్చినట్లు అనిపించినా వెంటనే వేడినీటితో ఆవిరిపడితే కొంత ఉపశమనం లభిస్తుంది.

చలిలో ఎక్కువ సేపు బయట ఉండకుండా మంచి రూమ్‌ టెంపరేచర్‌లో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కరోనాను కట్టడి చేయాలంటే వచ్చే ఈ మూడు నెలల పాటు ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉంటూ, స్వీయనియంత్రణ పాటిస్తూ తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తే కరోనా వైరస్‌ బారిన పడుకుండా ఉంటారని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
 
శీతాకాలంలో అప్రమత్తంగా ఉండాలి
ఇటీవల కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. చలికాలం ప్రారంభం కావడంతో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. శీతాకాలంలో ప్రతి ఒక్కరికి సాధారణంగా జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ వైరస్‌ ప్రభావం ఈ మూడు నెలలపాటు తీవ్ర ప్రతాపాన్ని చూపే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రజలు వివిధ రకాల పనులపై బయటికి వెళ్తుంటారు. వారు మాస్క్‌లు ధరించడం, శానిటైజర్‌ వాడకం వంటివి చేయాలి.

ఉదయం పూట పార్కులు, గ్రౌండ్స్‌, విశాలమైన ప్రదేశాల్లో వాకింగ్‌కు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి. వేడినీరు, వేడిగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైరస్‌ చలికాలంలో త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. బీపీ, షుగర్‌ తదితర వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా  జాగ్రత్తలు పాటించాలి.

పౌష్టికాహారం తీసుకోవాలి. కరోనా నిబంధనలు అందరూ పాటించాలి. కార్తీకమాసం కావడంతో ప్రజలు ఆలయాల దగ్గరకు ఉదయం నుంచి పెద్దఎత్తున చేరుకోవడం వంటి చేయవద్దని ఒకవేళ వెళ్లాలనుకున్నా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే జనం ఎక్కువగా గుమికూడే ప్రదేశాల్లో వైరస్ ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. 
 
ఈ మూడు నెలలు కీలకం
కరోనా వైరస్ రాష్ట్రంలోకి మార్చిలో ఎంటర్ అయింది. ఎండలు ఎక్కువ ఉండే సమయంలోనే కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఇప్పుడు చలికాలం వచ్చేసింది. దీంతో వైరల్​ఇన్ఫెక్షన్లు తొందరగా వ్యాపిస్తాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటివి వస్తుంటాయి. ఇలాంటి సమయంలో మరోసారి కరోనా విజృంభిస్తే కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. ఏ మాత్రం ఇన్ఫెక్షన్ సోకినట్లు అనిపించినా వెంటనే టెస్టు చేయించుకోవాలి.

దీంతో మిగిలిన వారికి సోకకుండా చూసుకోవచ్చు. చలి తీవ్రత బాగా పెరిగితే మరణాలు కూడా పెరగవచ్చని హెచ్చరిస్తున్నారు. రాబోయే మూడు నెలలు చాలా కీలకమని, మొదటి లాక్ డౌన్ లో ఎలాగైతే ఉన్నామో ఇప్పుడూ అలాగే ఉండాలని సూచిస్తున్నారు.  
 
మాస్క్​, భౌతిక దూరం తప్పనిసరి
కరోనా తగ్గు ముఖం పట్టిందని నిర్లక్ష్యం చేయడం కరెక్ట్​కాదు. చలికాలంలో కరోనా పెరిగే అవకాశాలు ఉంటాయి. అందరూ ఫిజికల్ డిస్టెన్స్ పాటించడతోపాటు మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలి.