గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (16:21 IST)

భర్త పుట్టింటికి పంపలేదని పసిబిడ్డలను ఉరేసి.. ఎంత పనిచేసింది..!?

క్షణికావేశాలకు ప్రాణాలు బలితీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా భర్త పుట్టింట జరిగే శుభకార్యానికి వెళ్లేందుకు అనుమతివ్వలేదని.. ఓ మహిళ తన ఇద్దరు పసిబిడ్డలను ఫ్యానుకు ఉరేసి చంపేసింది. ఆపై తాను కూడా అదే ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఢిల్లీ వాయవ్య ప్రాంతంలోని షాకూర్‌పూర్ ఏరియాలో గురువారం రాత్రి ఈ ఘటన వెలుగుచూసింది.
 
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన యువ దంపతులు కొన్నేండ్ల క్రితం బతుకుదెరువు కోసమని దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి షాకూర్‌పూర్ ఏరియాలో నివాసం ఉంటున్నారు. వారికి ఒక కొడుకు, ఒక బిడ్డ ఉన్నారు. భర్త స్థానికంగా ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తుండగా, భార్య ఇంట్లోనే ఉంటూ పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్నది. అయితే ఇటీవల బీహార్ రాష్ట్రం, మధుబని జిల్లాలోని తమ స్వగ్రామంలో ఒక మతపరమైన శుభాకార్యం జరుగుతున్నట్లు వారికి కుటుంబసభ్యుల నుంచి కబురు వచ్చింది.
 
దాంతో తాను ఆ శుభకార్యానికి వెళ్తానని భార్య భర్తను కోరింది. అందుకు అతడు అంగీకరించకపోవడంతో గురువారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం భర్త ఉద్యోగానికి వెళ్లిపోయాడు. అయితే ఆ గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య పసివాళ్లయిన తన ఇద్దరు పిల్లలను ఫ్యాన్ ఉరిబిగించి చంపింది. ఆ తర్వాత తాను కూడా అదే ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది.
 
రాత్రి 10.30 గంటలకు డ్యూటీ నుంచి వచ్చిన భర్త తలుపు ఎంత తట్టినా తీయకపోవడంతో కిటిలోంచి చూశాడు. లోపల ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన భార్యాపిల్లలను చూసి ఒక్కసారిగా గావుకేకలు పెట్టాడు. అనంతరం ఇరుగుపొరుగుతో కలిసి తలుపులు బద్దలుకొట్టి వారిని కిందికి దించారు. అయితే అప్పటికే చనిపోయారని నిర్ధారించుకుని పోలీసులకు సమచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.