ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 జులై 2024 (10:12 IST)

యూపీ బీజేపీలో లుకలుకలు... యోగి వర్సె కేశవ్ మౌర్య!!

yogi vs mourya
భారతీయ జనతా పార్టీకి అత్యంత పట్టున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. బీజేపీ అధికారంలో ఉండగా ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ కొనసాగుతున్నారు. అయితే, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ అగ్రనేతలైన యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యల మధ్య విభేదాలు పొడచూపాయి. ఇవి క్రమంగా చాపకింద నీరులో వ్యాపించి పార్టీలో తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఫలితంగా యూపీ బీజేపీలో లుకలుకలకు దారితీశాయి. ప్రస్తుతం ఈ అంశం కేవలం యూపీలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంపై బీజేపీ అధిష్టానం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇందుకోసం హడావుడిగా అయోధ్యలో రామాలయాన్ని కూడా నిర్మించారు. కానీ, అయోధ్య లోక్‌సభ సీటులో బీజేపీ అభ్యర్థి చిత్తుగా ఓడిపోగా, కాంగ్రెస్ అభ్యర్థి విజయభేరీ మోగించారు. ఈ ఫలితాల తర్వాత ఆ పార్టీ నేతల్లో నోటికి పని చెప్పారు. ఓటమిపై పార్టీ నేతల భిన్న వ్యాఖ్యలతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దానికి కొనసాగింపుగా అన్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మంగళవారం ఢిల్లీలో ఒంటరిగా భేటీ అయ్యారు. 
 
లోక్‌సభ ఎన్నికల ఫలితాల వైఫల్యంతోపాటు రాష్ట్రంలో త్వరలో జరగనున్న 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. యూపీ భాజపా అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి సైతం నడ్డాతో సమావేశమైనట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను తొలగించేందుకు కృషి చేయాలని ఆయనకు నడ్డా సూచించినట్లు తెలిసింది. మరోవైపు ప్రభుత్వం కంటే పార్టీయే గొప్ప అని కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించడం సంచలనమైంది. 
 
'పార్టీ అనేది ప్రభుత్వం కంటే గొప్పది. కార్యకర్తల బాధే నా బాధ. ఏ ఒక్కరూ పార్టీ కంటే పెద్దవారు కాదు. కార్యకర్తలు పార్టీకి గర్వకారణం. నా ఇంటి తలుపులు ప్రతి ఒక్కరికీ తెరిచే ఉంటాయి. నేను ఉప ముఖ్యమంత్రి కావడం తర్వాత సంగతి. అంతకంటే ముందు నేను పార్టీ కార్యకర్తను. కార్యకర్తలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గౌరవించాలి' అంటూ ఆయన తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది తమ పార్టీ నేతల్లో ఉన్న విభేదాలను చెప్పకనే చెప్పింది. ముఖ్యంగా, లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మౌర్యకు మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది.