గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (17:15 IST)

చంద్రబాబు నిర్ణయాలే ఓటమికి కారణాలా? మంగళగిరిలో పోటీ చేయడం తప్పు!

విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలే ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణాలై ఉండొచ్చని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ అధినాయకత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు ఎన్నికల్లో ఓటమికి కారణం అయ్యుండొచ్చన్నారు. 
 
ప్రత్యేక హోదా విషయంలో తమ పార్టీ అధినేత అంచనాలు తప్పాయని చెప్పొచ్చన్నారు. 2014 వరకు చంద్రబాబు సన్నిహితవర్గంలో తాను కూడా ఉండేవాడినని, కారణాలేవైనా కానీ ఆ తర్వాత ఐదేళ్లకాలంలో ఆ సాన్నిహిత్యం సన్నగిల్లిందని చెప్పుకొచ్చారు.
 
ముగిసిన ఎన్నికల్లో టీడీపీ ఓటమికి చంద్రబాబు బాధ్యత వహిస్తున్నా... ఈ ఓటమికి పార్టీకి చెందిన ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు. కొందరు అభ్యర్థులను తొలగించాల్సిన చోట చంద్రబాబు మొహమాటానికి పోయారని, మనుషుల్ని నమ్ముకోకుండా, టెక్నాలజీని, మెషీన్లను నమ్ముకున్నారన్నారు. ఐదేళ్ళ కాలంలో పాలనపై దృష్టిపెట్టిన చంద్రబాబు పార్టీని అశ్రద్ధ చేశారని ఫలితంగానే ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చిందన్నారు. 

ఎన్నో ఏళ్లుగా పసుపు జెండా ఎగరని నియోజకవర్గమైన మంగళగిరిలో నారా లోకేశ్ పోటీ చేయడం చాలా తప్పు అని సుజనా చౌదరి అన్నారు. ఎందుకంటే మంగళగిరి బీసీల ఆధిపత్యం ఉన్న ప్రాంతం కావడం లోకేశ్‌కు వ్యతిరేకంగా పరిణమించిందని, దానికితోడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేకి ఉన్న పట్టు కూడా లోకేశ్ ఓటమి కారణంగా చెప్పుకోవచ్చన్నారు. ఈ ఐదేళ్లలో ఆర్కే ఎంతో కష్టపడి పనులు చేయడమే కాకుండా నిత్యం ప్రజల్లో ఉన్నాడని తెలిపారు.