1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (20:37 IST)

అప్పులు చేసి.. పొలాలు అమ్ముకుని అమెరికాకు రావొద్దంటున్న ఎన్నారైలు

అమెరికా.. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలనేది ప్రతి విద్యార్థి/యువకుడి కల. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కల.. కలగానే మిగిలిపోయేలా ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాలతో అక్కడి పరిస్థితులు గణనీయంగ

అమెరికా.. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలనేది ప్రతి విద్యార్థి/యువకుడి కల. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కల.. కలగానే మిగిలిపోయేలా ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాలతో అక్కడి పరిస్థితులు గణనీయంగా మారుతున్నాయి! కంపెనీల్లో నియామకాలపై ఆంక్షలు మొదలయ్యాయి. ఉద్యోగం దొరకడం కష్టంగా మారింది. భద్రత ప్రశ్నార్థకం అవుతోంది. దాంతో, ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు రావద్దని, వచ్చినా.. భవిష్యత్ ప్రశ్నార్థకమేనని ప్రవాస తెలుగువారు హెచ్చరిస్తున్నారు.
 
ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న పరిస్థితులపై పలువురు ఎన్నారైలు స్పందిస్తూ ఇకపై అమెరికా ఉద్యోగం మాట మరిచిపోవాల్సిందేనంటున్నారు. మున్ముందు హెచ్-1బీ వీసాతో అంత సులువుగా ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదని అభిప్రాయపడుతున్నారు. 
 
అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాను ఎంచుకోవద్దని, ఒకవేళ చదువు తర్వాత ఉద్యోగం దొరికినా దొరకకపోయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం రావచ్చని విద్యార్థులకు, యువతకు ఎన్నారైలు సూచన చేస్తున్నారు. 
 
పరిస్థితులు చక్కబడిన తర్వాత రావాలని చెబుతున్నారు. చదువుకునేందుకు ఇబ్బంది లేదని, చదువు తర్వాత ఖచ్చితంగా ఇక్కడే ఉద్యోగం సంపాదించాలనుకునే వారు మాత్రం రాకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు.
 
ముఖ్యంగా అప్పులు చేసి, పొలాలు అమ్ముకుని అమెరికాకు రావాలనుకునే వారు మాత్రం ఆ ఆలోచననే పక్కన పెట్టడం మంచిదని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్‌లో మరింత కష్టకాలం ఏర్పడే పరిస్థితులున్నాయని, ఇక్కడికి వచ్చి జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకోవద్దని సూచిస్తున్నారు.