గణపతి పూజకు చతుర్థి వ్రతం విశేషం.. 21 ప్రదక్షిణలు చేస్తే..?
గణపతి పూజకు చతుర్థి వ్రతం విశేషమైంది. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాతనే గణపతి పూజ చతుర్థి వ్రతం రోజున చేస్తారు. ఏ రోజైతే చవితి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందో ఆ రోజు వినాయకుడికి పూజ చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. సంకష్టహర చతుర్థి రోజున మాత్రమే కాకుండా.. మాసంలో వచ్చే చతుర్థి తిథి రోజున వినాయకుడికి గరిక సమర్పించాలి.
శక్తి ఉన్నవారు ఆ రోజు ఆలయంలో గణపతి హోమం జరిపించుకుంటే మంచిది. లేని పక్షంలో వినాయకునికి పంచామృత అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవచ్చు. ఈ రోజున చతుర్థి వ్రతం చేసేవారు సాయంత్రం వేళలో వినాయకుని ఆలయానికి వెళ్లి 21 ప్రదక్షిణలు చేయాలి.
ఆలయానికి వెళ్లలేని వారు ఇంట్లోనే సూర్యాస్తమయం తర్వాత విఘ్నేశ్వరుని పంచామృతాలతో అభిషేకించి, అష్టోత్తర శతనామాలతో స్వామిని అర్చించి కొబ్బరి కాయలు, పండ్లు, ఉండ్రాళ్లు, మోదకాలు, పులిహోర నైవేద్యంగా గణపతికి సమర్పించాలి. ఈ వ్రతం ఆచరించే వారికి నవగ్రహ దోషాలుండవు. ఈతిబాధలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.