కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం.. గర్భాశయానికి..?
కార్తీక పౌర్ణమి రోజున మహిళలు పగలంతా ఉపవసించి.. రాత్రి దీపారాధనకు తర్వాత భోజనం చేసుకోవడం ఆచారం. కార్తీక పౌర్ణమి రాత్రి దీపారాధన చేశాక చలిమిడిని చంద్రుడికి నివేదించి, ఫలహారంగా స్వీకరించాలని శాస్త్రోక్తి. ఆరోగ్యపరంగా గమనిస్తే ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేదం చెప్తోంది.
అలాగే శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం కార్తీక పౌర్ణమి మరో ప్రత్యేకత. వృషవ్రతం, మహీఫలవ్రతం, నానా ఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం, కృత్తికా వ్రతం లాంటి వ్రతాలు, నోములు నోచుకుంటారీ రోజు. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రదక్షిణ, లక్షవత్తులు, లక్షరుద్రం లాంటి పూజలూ చేస్తారు.
దైవ దర్శనం, దీపారాధన, దీపదానం , సాలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహణ ఇవన్నీ కార్తీక పున్నమి రోజు విశేష శుభ ఫలితాలను ఇస్తాయని కార్తీక పురాణం చెబుతోంది. కార్తీక పౌర్ణమి రోజున అరుణ గిరిపై వెలిగించే కార్తీక దీపం ఎంతో విశిష్టమైనది.
వందల టన్నుల ఆవునెయ్యిలో వేల టన్నుల నూలు వస్త్రాన్ని ముంచి, అరుణగిరి కొండలపై వెలిగించే ఈ దీపం ముందు ఆనాటి పున్నమి వెన్నెల చిన్నబోతుంది. పదిరోజులపాటు వరుసగా పున్నమి వెన్నెలను వెదజల్లడం ఈ దీపం ప్రత్యేకత. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున ఉపవసించి.. సాయంత్రం ఆరు గంటల పైగా దీపారాధన చేసి.. మహేశ్వరుని అనుగ్రహం పొందండి.