గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శనివారం, 8 డిశెంబరు 2018 (17:55 IST)

తెల్లజిల్లేడు పువ్వులను పరమేశ్వరునికి సమర్పిస్తే? (video)

శివుడిని కార్తీక మాసంలో పూజించడం ద్వారా సర్వశుభాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే.. కోరిక కోర్కెలు నెరవేరాలంటే.. ఈతిబాధలను దూరం చేసుకోవాలంటే.. శివుడిని పూజించడమే సరైన మార్గం. శివుడిని నిష్ఠతో పూజించి.. తమకు చేతనైనంత నైవేద్యాన్ని భక్తితో సమర్పించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయి. 
 
అలాగే పరమేశ్వరుడిని సోమవారం పూట పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు పొందవచ్చు. అలాగే పండుగ నెలలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున ఈశ్వరుడిని స్తుతిస్తే.. ఇంకా ఆరుద్ర వ్రతమాచరించిన వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. మహాశివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం, బిల్వార్చన చేసేవారికి ఆర్థిక ఇబ్బందులు వుండవు. 
 
ఇంకా కార్తీక పౌర్ణమి రోజున ఉమా మహేశ్వర వ్రతం ఆచరించే వారికి ఈతిబాధలు వుండవు. ఫాల్గుణ మాసంలో కళ్యాణ వ్రతం చేసేవారికి, వైశాఖ మాసంలో వచ్చే అష్టమి రోజున చేపట్టే వ్రతం, దీపావళి అమావాస్య రోజున చేపట్టే కేదార వ్రతం ద్వారా కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయి.  
 
అంతేగాకుండా ప్రతి సోమవారం ఈశ్వరాలయాన్ని సందర్శించుకునే వారికి ఈతిబాధలు వుండవు. పరమేశ్వరుడిని దర్శనం చేసుకున్న తర్వాత విభూదిని నుదుట రాసుకోవడం మరిచిపోకూడదు. ఆలయాల్లో పంచాక్షరీ మంత్రాన్ని పఠించడం తప్పనిసరి. అలాగే రోజుకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆయుర్దాయం పెరుగుతుంది. 
 
మాసానికి ఓసారైనా నీటితో లేదా పాలతో శివునికి అభిషేకం చేయించాలి. వీలైతే బిల్వ పత్రాలను, పుష్పాలను స్వామివారికి సమర్పించుకోవాలి. వీలైతే తెల్ల జిల్లేడు పువ్వులను ఆలయాల్లోని ఈశ్వరునికి సమర్పించడం ద్వారా సమస్త దోషాలను తొలగించుకోవచ్చు. 
 
శివునిని ప్రార్థించేందుకు ముందు విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించాలి. ఇలా చేస్తే.. రుణబాధలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అలాగే శివాలయాలకు వెళ్ళినప్పుడు ఈశ్వరుడిని దర్శనం చేసుకున్నాక అమ్మవారికి నేతితో దీపమెలిగించాలి. ఇలా చేస్తే.. అమ్మవారి అనుగ్రహం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. 
 
శివాలయ సందర్శన తర్వాత చేతనైన ఆహార పదార్థాలను పేదలకు దానంగా ఇవ్వాలి. శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే.. శివపూజకు ముందు ముత్యంతో చేసిన ఆభరణాలను ధరించడం ఉత్తమం. అలాగే ఇంట్లోనే శివపూజ చేయాలనుకుంటే.. శివ లింగానికి ప్రతిరోజూ ఉదయం నీటితో, పాలతో అభిషేకం చేసి.. విభూది, బిల్వాలను సమర్పించుకోవాలి. 
 
అగరవత్తులను వెలిగించి.. కర్పూర హారతి ఇవ్వడం మంచిది. ముఖ్యంగా సోమవారం పూట ఇంట్లోని శివలింగానికి పాలతో అభిషేకం చేసి పాలతో చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చునని పండితులు చెప్తున్నారు.