బుధవారం, 1 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (19:04 IST)

''నాగపంచమి'' పూజ ఎలా చేయాలంటే?

సాక్షాత్తు పరమేశ్వరుడే "నాగపంచమి"నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీ దేవికి వివరించినట్లుగా స్కాందపురాణం చెబుతోంది. పంచమి రోజున నాగప్రతిమకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు గావించి, పాయసము నివేదించాలని ముక్కంటి.. శక్తిమాతకు వివరించినట్లు ఆ పురాణం పేర్కొంటుంది.
 
అందుచేత నాగపంచమి రోజున సూర్యోదయమునకు ముందే ఐదు గంటలకే లేవాలి. శుచిగా తలస్నానము చేసి, ఎరుపురంగు బట్టలు ధరించాలి. పూజామందిరమును, ఇల్లును శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ, గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి. పూజామందిరము, ఇంటిముందు ముగ్గులు పెట్టాలి.
 
పూజకు గంధము, కుంకుమ, ఎరుపు వస్త్రము, నాగేంద్ర స్వామి, పాముపడగ, తెల్లని అక్షింతలు, ఎర్రటి పువ్వులు (కనకాంబరాలు), మందారమాలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్లు, వడపప్పు, అరటిపండ్లను సిద్ధం చేసుకోవాలి. అంతేగాకుండా రెండు ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకుని దూదితో 7 వత్తులలో నేతితో దీపమెలిగించాలి.
 
పూజ చేసే సమయంలో నుదుట కుంకుమను ధరించి, పడమర దిక్కున తిరిగి పూజించాలి. "ఓం నాగరాజాయనమః" అనే మంత్రమును 108 మార్లు జపించి, పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమ లేదా నాగేంద్ర స్వామి చిత్రపటమునకు కర్పూర హారతులిచ్చి, నైవేద్యం సమర్పించుకోవాలి.
 
వీలైతే కర్పూర హారతులిచ్చేందుకు ముందు నాగ అష్టోత్తరము, నాగ స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములలో ఏదైనా ఒక దానితో నాగేంద్ర స్వామిని ప్రార్థించవచ్చు. ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్యపూజ, నాగదోష-పరిహారము వంటి పుస్తకములను తాంబూలము, పసుపు, కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్య ఫలం సిద్ధిస్తుంది.
 
అలాగే.. నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయించడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు. దేవాలయములో నాగా అష్టోత్తరములు, పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.