ఏకాదశి వ్రతం ఎలా చేయాలంటే? (video)
ఏకాదశి వ్రతం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఏకాదశికి ముందు రోజు అంటే దశమిరోజు రాత్రి పూట భోజనం చేయకూడదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు, ఉద్యోగులు, శ్రామికులు, పిల్లలు, పెద్దలు తేలికపాటి అల్పాహారాన్ని, పండ్లుపాలు తీసుకోవాలి.
మరుసటి రోజు అంటే ఏకాదశిరోజు ప్రాతఃకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి దైవారాధన, దీపారాధన చేసుకుని తమతమ కార్యాక్రమాలు యథావిధిగా చేసుకోవాలి. మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు. ఉదయం పూట అవకాశం ఉన్నవారు దేవాలయాల సందర్శన, పూజలు, స్తోత్ర పారాయణాలు చేయాలి.
వీలైతే తప్పక గోపూజ చేయండి. గో పూజ చేయడం ద్వారా మంచి ఫలితం వుంటుంది. ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి. వీలుకాకుంటే నిద్రపోయే వరకు విష్ణునామస్మరణ చేసుకోండి.
రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి. మర్నాడు ద్వాదశి పారణ చేయాలి. అంటే ప్రాతఃకాలంలోనే లేచి యధావిధిగా శుచిగా స్నానమాచరించి.. దేవతారాధన చేసుకుని మహానైవేద్యాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించి వెంటనే అతిథి ఉంటే వారికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి.
అతిథి లేకుంటే కొంత అన్నాన్ని బలిభుక్కుల కింద కనిపించే, కనిపించని జీవరాశికి ఇంటిబయట ఒక ముద్ద పెట్టి వచ్చి భోజనాన్ని చేయాలి. ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనవి.. కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే.. శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.