1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 30 జులై 2014 (16:13 IST)

అహం తొలగించేది భక్తి!

భగవంతుని చెంతకు చేరడంలో మనిషికి అడ్డు అతని అహమే. నిజమైన భక్తుడు అహంకారం ప్రదర్శించడు. తాను అందుకున్నది భగవాన్ ప్రసాదం అంటాడు. తనకు కలిగే కష్టాలను భగవంతుని లీలగానే స్వీకరిస్తాడు. అది అసలుసిసలైన భక్తుడి తీరు. 
 
అయితే, కొందరు దీనికి భిన్నంగా ప్రవర్తిస్తారు. కొందరు భక్తుల్లో అహంకారం తీవ్రస్థాయిలో ఉంటుంది. ఆ అహంకారమే వారి పతనానికి దారితీస్తుంది. ఎన్నో మంచి గుణాలుంటాయి. భక్తి, దాన, శౌర్యం గుణం వగైరాలుంటాయి. కానీ, భగవంతుని ప్రశ్నిస్తారు. ఆ అనంతమూర్తిని అంగీకరించరు. ఫలితంగా వారి అహం వారిని భగవంతునితో ఘర్షణకు తీసుకెళుతుంది. రాక్షస రాజులందరి కథ ఇదే. 
 
రావణుడు, హిరణ్యకశిపుడు, బలి చక్రవర్తి వంటి వారందరిలోని అహం అణచటానికే శ్రీమహావిష్ణువు వివిధ ఆవతారాలు ధరించి రావాల్సి వచ్చింది. శ్రీమహావిష్ణువు చేతిలో జీవితం చాలించే సమయంలో కానీ, వారు తమ అహంకారం గురించి అర్థం చేసుకుని, ఆయన పాదాలపై మోకరిల్లుతారు. అందుకే భక్తులు ఆరంభంలోనే అహం వదిలితే జీవితం ఆనందమయంగా గడుస్తుంది.