శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (20:52 IST)

శ్రీకృష్ణునికి శిరోభారం, భార్యలు ఏం చేశారు? రాధ ఏం చేసింది? (video)

ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్మ తీవ్రమైన శిరోభారంతో బాధపడుతున్నాడు. ఆయనకు వచ్చిన తలనొప్పి తగ్గేందుకు తరోణోపాయాలు ఏమిటని ఆయన సతీమణులు గాభరా పడుతున్నారు. ఈ సమయంలో అక్కడికి వేంచేశారు నారద ముని. నారాయణ నారాయణ అంటూ... శ్రీకృష్ణుడు ఏదో తీవ్రంగా బాధపడుతున్నారే అంటూ అడిగారు.
 
ఎవరూ నోరు మెదపలేదు. చివరికి కృష్ణుడే... నాకు శిరోభారంగా వుంది నారదా అని చెప్పాడు. మరి తగ్గే మార్గమేమిటో మీరే సెలవివ్వండి అని నారదుడు అడిగేసరికి... నాకు ప్రియులైన శిష్యులు ఎవరైనా తమ అరికాలి మట్టిని తెచ్చి నా నుదుటికి రాస్తే తగ్గిపోతుంది అని చెప్పాడు. అంతేకాదు.. అలా అరికాలి మట్టిని ఇచ్చేవారి ధూళితోపాటు వారి పాపపుణ్యములు కూడా నాకే చెందుతాయన్నాడు. 
 
వెంటనే నారదుడు... శ్రీకృష్ణుని భార్యలను అడిగాడు. వారంతా... అబ్బే, మంచి వైద్యులను పిలుపించుదామని అన్నారు. తమ పాదాల ధూళి ఇస్తే ఎక్కడ తమ పుణ్యం పోతుందోనని. చివరికి నారదుడు రాధ వద్దకెళ్లి విషయాన్ని చెప్పాడు. ఆమె మరో ఆలోచన లేకుండా తన అరికాలి ధూళిని ఇచ్చేసింది. వెంటనే నారదుడు అందుకుని, రాధమ్మా... నీవు నీ అరికాలి ధూళి ఇచ్చేశావు, మరి నీ పుణ్యం అంతా పోతుందే అని ప్రశ్నించాడు. 
 
అందుకు రాధ సమాధానమిస్తూ... నా దేవుడు శ్రీకృష్ణుని శిరోభారం తగ్గడమే నాకు ముఖ్యం. దాని ముందు నేను చేసుకున్న పుణ్యం పెద్దదేమీ కాదు అంటూ సమాధానం చెప్పింది. దానితో నారదుడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి ఆ రాధ అరికాలి పాద ధూళిని ఇచ్చేందుకు చూడగా, శ్రీకృష్ణుని హృదయంలో రాధ అలా పవళించి కనబడింది. నిజమైన భక్తుడు లేదా శిష్యుడు భగవంతుడి హృదయంలో అలా తిష్ట వేసుకుని వుంటాడనీ, నిజమైన శిష్యుడు ఎలా వుంటాడో దీన్నిబట్టి  అర్థం చేసుకోవచ్చని రామకృష్ణ పరమహంస చెప్పారు.