1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 28 సెప్టెంబరు 2015 (13:48 IST)

ఏడుకొండలవాడి నేత్ర దర్శనం, నిజపాద దర్శనం విశిష్టత

కలియుగ వైకుంఠం, శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో గురు, శుక్రవారాలు ప్రత్యేకం. గురువారం రోజున శ్రీవారి నేత్ర దర్శనం చేసుకునే వారికి సకల సంపదలు చేకూరి, సజ్జనులుగా జీవిస్తారనే విశ్వాసం ఉంది. గురువారం రోజున ధవళ వస్త్రాలతో, నేత్ర దర్శనమిచ్చే వెంకన్న స్వామిని దర్శించుకునే వారికి మనోధైర్యం, భోగభాగ్యాలు, సిరిసంపదలు చేకూరుతాయి. శుక్రవారం పూట శ్రీవారికి ఆగమ శాస్త్రోక్తంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించే వారికి ఈతిబాధలు తొలగిపోయి శ్రీమన్నారాయణ, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
 
గురువారం ధవళ వస్త్రాలతో దర్శనమిచ్చే శ్రీవారికి శుక్రవారం పూట అభిషేకాలు నిర్వహించి, పట్టు వస్త్రాలను సమర్పించే భక్తులను కోటి జన్మల పుణ్య ఫలాలు, భోగ భాగ్యాలు, లక్ష్మీ కటాక్షం చేకూరుతుందని విశ్వాసం.
 
శుక్రవారం శ్రీవారి నిజపాద దర్శనం: 
తిరుమల ఏడు కొండలపై శుక్రవారం శ్రీవారి నిజపాద దర్శనం ఉంటుంది. గురువారం స్వామి వారికి ధరించే ధవళ వస్త్రాలను తొలగించి అభిషేక, ప్రత్యేక పూజలకు అనంతరం పట్టు వస్త్రధారణ జరుగుతుంది. దీనితో పాటు స్వామివారి నిజపాద దర్శనం కూడా ఉంటుంది. 
 
ఈ రోజున పట్టు పంచె, ఏడు కొండల ఏలికకు పట్టు తలపాగా, బుగ్గన చుక్కతో గోకుల విహారి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. భక్తుల కొంగు బంగారమైన వేంకటాచలపతి శుక్రవారం పూట దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పండితులు చెపుతున్నారు.