బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2017 (13:12 IST)

వామ్మో... శ్రీవారి ప్రసాదంలో అపుడు చీమలు.. బొద్దింకలు.. ఇపుడు తేళ్లు.. జెర్రులు...

తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది నిర్లక్ష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచ నలుమూలల నుంచే వచ్చే భక్తులు గదులు, దర్శనం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు వారి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్

తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది నిర్లక్ష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచ నలుమూలల నుంచే వచ్చే భక్తులు గదులు, దర్శనం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు వారి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారు. ఇది ఇప్పటిది కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఇలాగే ఉన్నా తితిదే ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా శ్రీవారి ప్రసాదంలో జెర్రి కనిపించడం కలకలం రేపుతోంది. తితిదే అన్నప్రసాద సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారో దీన్ని బట్టే అర్థమవుతోంది. ఎంతో పవిత్రంగా భావించే స్వామివారి ప్రసాదంలో జెర్రి రావడం భక్తులను ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
 
ప్రపంచంలోనే పేరుగాంచిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల ఒకటి. తిరుమలకు ప్రతిరోజు 50 నుంచి 60 వేలమందికిపైగా భక్తులు వస్తూ, పోతుంటారు. అధికసంఖ్యలో భక్తులు వచ్చే ఆలయాల్లో తిరుమల ప్రధానమైనది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అలాంటి తిరుమలలో పనిచేసే ఉద్యోగస్తులు ఎంతో నిబద్దతతో పనిచేయాలి. కానీ  ఆ విధంగా వ్యవహరించరు కొంతమంది తితిదే ఉద్యోగస్తులు. ఏదో చేశామా.. అయిపోయిందా అనుకుని వెళ్ళిపోతుంటారు. అది మరి పరిస్థితి. అందుకే ఏది మారినా తితిదే ఉద్యోగస్తుల తీరు మాత్రం మారదంటారు.
 
ఇలాంటి తితిదే సిబ్బంది, ఉద్యోగస్తుల నిర్లక్ష్యం కారణంగా అరకొర పనులతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో తితిదే పంపిణీ చేసే ఏదైనా పవిత్రమే. భక్తులు ఎంతో పవిత్రంగా వాటిని భుజిస్తుంటారు. కానీ తితిదే అందించే ఆ ప్రసాదాల్లో ఎన్నోసార్లు పురుగులు కనిపించాయి. అంతేకాదు చీమలు, బొద్దింకలు ఇలా ఎన్నో... ఎన్నెన్నో.. తాజాగా భక్తులకు అందించే ప్రసాదాల్లో జెర్రి కనిపించింది. అది కూడా భక్తుడికి ఇచ్చిన ప్రసాదాన్ని సగం తినేసిన తర్వాత. 
 
హైదరాబాద్‌కు చెందిన  శ్రీనివాసులు అనే భక్తుడు కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనార్థం వచ్చాడు. యాత్రిసదన్ -1 వద్ద శ్రీవారి సేవకులు అందిస్తున్న సాంబారు అన్నంను తీసుకున్నాడు. తింటుండగా ఒక్కసారిగా అందులో జెర్రి కనిపించింది. దీంతో వెంటనే శ్రీవారి సేవకులకు వాటిని చూపించాడు. తమకేం తెలియదంటూ ఆ భక్తుడితో వారు గొడవకు దిగారు. విషయం కాస్త మీడియాకు తెలిసింది. మీడియా అక్కడకు రాగానే తితిదే ఉద్యోగస్తులు పరుగులు పెట్టారు. ఇది తితిదే సిబ్బంది నిర్లక్ష్యం కాదని, ప్రసాదాలు ఇచ్చే సమయంలో చెట్ల పై నుంచి జెర్రి పడి ఉండవచ్చని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయాన్ని భక్తుడు సీరియస్‌గా తీసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాడు.
 
దీంతో తితిదే ఉన్నతాధికారులు ఈ విషయంపై విచారణ జరపాలని తితిదే విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. వీరి విచారణ ఎలాగున్నా శ్రీవారి భక్తుల మనోభావాలు మాత్రం దెబ్బతింటోంది. ఇలాంటివి తిరిగి పునరావృతం కాకుండా తితిదే ఉన్నతాధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలంటున్నారు భక్తులు.