సీతాదేవితో హనుమంతుడు సంభాషించేటపుడు...
దైవ మార్గములో పయనించదలిచేవారు దేహాభిమానాన్ని, పేరు ప్రతిష్ఠలను దూరంగా ఉంచాలి. తనను లోక సేవకునిగాను, భగవంతుని దాసానుదాసుని గాను భావించాలి. మానవుడు నిరాడంబరుడై తనను భగవంతుని యొక్క ఒకానొక సేవకునిగా తలంచుచు వినయ విధేయతలు కలిగి వర్తించాలి. చేతనైనంతవరకు లోకోపకారం చేస్తుండాలి.
గౌరవ మర్యాదలను కాంక్షించరాదు. తాను గొప్పవాడైనా తన గొప్పను గూర్చి ఇతరులకు చెప్పుకొనగారాదు. అశోకవనమందు సీతాదేవితో సంభాషించేటప్పుడు హనుమంతుడు తాను శ్రీరామచంద్రుని వద్దగల వానరులలో చివరి వాడను అని చెప్పుకొన్నాడు.
ఎంత బలము, సామర్థ్యము, శక్తి కల్గియున్ననూ హనుమంతుడు ఎంతటి వినయవిధేయతలు కలిగియున్నాడో లోకానికి తెలిసియేయున్నది కదా. కాబట్టి తరింపగోరేవారు నిరభిమానులై, భక్తి ప్రపత్తులు గలవారై ప్రతిష్ఠల కోసమై ప్రాకులాడక ప్రశాంత జీవితాన్ని గడపాలి. అట్టి నిరభిమానుల వల్లనే లోకోద్ధరణ సంభవిస్తుంది. వారివల్లనే లోకం సుభిక్షంగా వుంటుంది.