ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: సోమవారం, 9 ఏప్రియల్ 2018 (14:02 IST)

శత్రువులుగా అయితే మూడు జన్మల్లోనే... మిత్రులుగా అయితే 7 జన్మలు... ఏది కావాలి?: శ్రీ మహావిష్ణు

నిర్మలంగా, ప్రశాంతంగా రోజులు, కాలం సాగుతున్నాయి. వేదాలను సంరక్షించడానికి మత్స్యావతారాన్ని, పాల సముద్ర మథనంలో శేషసాయికి ఆధారంగా కూర్మావతారాన్ని పొంది శ్రీ మహావిష్ణువు ఘనవిజయం సాధించి లోకాలను సంరక్షించి విశ్రాంతి పొందుతుండగా కృతయుగంలో ధర్మం నాలుగు పాదా

నిర్మలంగా, ప్రశాంతంగా రోజులు, కాలం సాగుతున్నాయి. వేదాలను సంరక్షించడానికి మత్స్యావతారాన్ని, పాల సముద్ర మథనంలో శేషసాయికి ఆధారంగా కూర్మావతారాన్ని పొంది శ్రీ మహావిష్ణువు ఘనవిజయం సాధించి లోకాలను సంరక్షించి విశ్రాంతి పొందుతుండగా కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల నడుస్తూ సుభిక్షంగా లోకాలను ఏలుతుంది. అలాంటి ఒక సందర్భంలో సనకసనందన సనత్కుమారులు అనే ఋషి కుమారులు శ్రీహరి దర్శనార్ధం వైకుంఠం చేరారు. 
 
కానీ ఆ సమయం దర్శనానికి అనుచితం అవడంతో ద్వార పాలకులైన జయ విజయములు అనుమతించక అడ్డగించారు. ఎన్ని రకాలుగా చెప్పిన వినకపోయేసరికి ముని కుమారులకు ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకు వచ్చాయి. ఏ వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉంటూ ఇంతటి గర్విష్టులుగా  ఉన్నారో ఆ వైకుంఠానికి దూరంగా బ్రతకండి అంటూ శపించారు.
 
శాపానికి భయకంపితులయ్యారు ద్వారపాలకులు. విష్ణువును శరణు వేడారు. ఈ శాపం నుండి విముక్తులను చేయమన్నారు. అంతట శ్రీ హరి ఋషి కుమారుల శాపాన్ని ఉపసంహరించే శక్తి నాకు లేదు. కానీ ఈ శాపానికి ఒక చిన్న సవరింపు చేయగలను... అంటూ ''మూడు జన్మలు శత్రువులుగా ఉండి, నాచే సంహరింపబడి తిరిగి వైకంఠం చేరడం లేదా ఏడు జన్మలు మిత్రులుగా ఉండి వైకుఠం చేరడం'' ఈ రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోండి అన్నాడు. ఏడు జన్మలు వైకుంఠాన్ని వదిలి ఉండలేమని, కనుక మూడు జన్మలు బద్దశత్రువులుగానే ఉండి తిరిగి వైకుంఠానికి వచ్చేస్తామని పలికారు ద్వారపాలకులు. 
 
అలా మూడు జన్మలలో మెుదటిది హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రెండవది రావణ కుంభకర్ణులు. మూడవది శిశుపాలదంతవక్తృలు. మెుదటి జన్మ ముగించడానికి స్వామి వరాహ-నారసింహ అవతారాలను రెండో జన్మ ముగించడానికి శ్రీ రామావతారాన్ని మూడవ జన్మ ముగింపుకై శ్రీ కృష్ణవతారాన్ని దాల్చాడు. అలా మెుదటి జన్మలో ఏ నిర్ణీతత్వ పదార్ధాలు ఏ నిర్ణీతత్వ రూపాలతోనూ తనకు మరణం రాకూడదని వరాలు పొందిన హిరణ్యకశిపుడు నా హరి ప్రతిచోట నిండి ఉన్నాడు అన్న తన కుమారుడు ప్రహ్లాదుడి మాటలకు ఏడిరా నీ హరి ఏడీ అన్ని చోట్లా ఉన్నాడన్నావే  ఏదీ ఈ స్తంభంలో ఉన్నాడా ఉంటే వెలుపలికి రమ్మను చూద్దాం... అంటూ గర్జించి నిండు సభలో ఒక స్తంభాన్ని గదతో పగలకొట్టాడు. 
 
అంతే ఈ జగమంతా, సర్వత్రా అణువణువున తానే నిలచి ఉన్న దేవదేవుడు ఆ స్తంభం నుండి నరసింహవతారంలో బయటకు వచ్చి భీకరంగా ఘర్జిస్తూ, హిరణ్యకశిపుని లాగి, తన తొడలపై వేసుకొని కడుపు చీల్చి ప్రేగులు తెంచి హిరణ్యకశిపునికి బ్రహ్మ ఇచ్చిన వరాలకు వీలుగానే అసుర సంహారం చేశాడు. మిగిలిన శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాల్లోనూ వీరిని సంహరించి శాప విముక్తులను చేశాడు.