శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (10:48 IST)

ముక్కంటి సన్నిధిలో రూపాయి, పావలా బతుకులు...!

కన్నప్ప తన కనుగుడ్డులోడి శివునికి అమర్చి భక్తకన్నప్పగా నిలిచిపోయారు. శివునితో సమానంగా పూజలందుకుంటున్నాడు. ఒకసారి కంట రక్తం కార్చినందుకే కన్నప్పకు అంతటి స్థానం లభించింది. అలాంటిది దశాబ్ధ కాలానికిపైగా శ

కన్నప్ప తన కనుగుడ్డులోడి శివునికి అమర్చి భక్తకన్నప్పగా నిలిచిపోయారు. శివునితో సమానంగా పూజలందుకుంటున్నాడు. ఒకసారి కంట రక్తం కార్చినందుకే కన్నప్పకు అంతటి స్థానం లభించింది. అలాంటిది దశాబ్ధ కాలానికిపైగా శివుని సన్నిధిలోనే ఉంటూ, రెండు కళ్ళలో రక్తం కారుతున్నా కనికరించడం లేదు ముక్కంటీశ్వరుడు. ఇంతకీ ఎవరు వాళ్లు.. ఎందుకు కళ్లలో రక్తం కార్చుతున్నారు.
 
శ్రీకాళహస్తి ఆలయ అన్నదానం క్యాంటీన్‌లో పనిచేస్తున్న కార్మికుల దురావస్థ తెలుసుకుంటే మన కళ్ళలోను రక్తం కారుతుంది. కన్నీరు ధారగా ప్రవహిస్తుంది. దేవస్థానం ఉద్యోగంపై ఆశతో, పదేళ్ళకుపైగా క్యాంటీన్‌ కార్మికులు చేస్తున్న శ్రమ, ఒకనాటి బానిసల బతుకులను గుర్తుకు తెస్తుంది. శ్రమ దోపిడీ అంటే ఏమిటో అర్థమవుతుంది.
 
శ్రీకాళహస్తి ఆలయంలో అన్నదానం పథకం అమల్లో ఉంది. మంగళ, బుధ, గురువారాల్లో 1600 మందికి, రద్దీ ఎక్కువగా ఉఉండే శుక్ర, శని, ఆది, సోమవారాల్లో 2 వేల మందికి మధ్యాహ్నం భోజనం పెడతారు. ఇటీవల రాత్రి పూట కూడా 150 మందికి భోజనం వడ్డిస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా సాగుతున్న అన్నదానం పథకానికి దేవస్థానం ప్రత్యేక సిబ్బందిని నియమించలేదు. వండి, వడ్డించే పనిని కాంట్రాక్టుకు ఇచ్చి నెట్టుకొస్తున్నారు. 
 
శ్రీకాళహస్తి సమీప గ్రామాలకు చెందిన 20 మంది అన్నదానం క్యాంటీన్‌లో పనిచేస్తున్నారు. మరో 15 మంది హౌస్‌ కీపింగ్‌ కింద పనిచేస్తున్నారు. ఈ 15 మందికి కాంట్రాక్టరు జీతాలు చెల్లిస్తారు. మిగిలిన 20 మందికి జీతాలు లేవు. ఒక్కోప్లేటుకు రూపాయి 25 పైసలు వంతుల చెల్లిస్తారు. 2 వేల మంది భోజనం చేసే రోజుల్లో రోజుకు 2,500 రూపాయలు వస్తుంది. దీన్ని 20 మంది పంచుకోవాలి. ఒక్కొక్కరికి 125 వస్తుంది. రోజుకు 1600 మంది భోజనం చేసే రోజుల్లో ఒక్కో కార్మికునికి రోజుకు వంద రూపాయలు మాత్రమే వస్తుంది. ఈ లెక్కన నెలకు 3 వేల, 3,500వస్తుంది.
 
క్యాంటీన్‌లో పనిచేసే కార్మికులు ఉదయం 7 గంటలకు పనిలోకి రావాలి. వంటగది, హాలు పాత్రలు శుభ్రం చేసుకోవాలి. కూరగాయలు తరుక్కోవాలి. బియ్యం, పప్పులు శుభ్రం చేయాలి. ఆపై వంట సిద్థం చేయాలి. ఆ తరువాత ఉదయం 11.30గంటల నుంచి మధ్యాహ్నం 2.30దాకా వడ్డించాలి. కంచాలు, గ్లాసులు కడాలి. చివరగా హాలు శుభ్రం చేయాలి. ఈ పనులన్నీ పూర్తయ్యే సరికి సాయంత్రం 6గంటలు అవుతుంది. 
 
ఆపై రాత్రికి 150మందికే భోజనం సిద్థం చేయాలి. రాత్రికి నలుగురు అందుబాటులో ఉండి వడ్డించాలి. ఇంత చాకిరీ ఉంటుంది. అయినా ఆ కార్మకులకు దక్కుతున్నది రోజుకు వంద, 125రూపాయలు మాత్రమే. ధరలు, జీతాలు పెరుగుతున్నా కార్మికుల ఒకటి పావలా రేటు మాత్రం 2012నుంచి మారడం లేదు. 
 
కాయం కష్టం చేస్తూ ఎందుకు క్యాంటీన్‌లో మగ్గిపోతున్నారని కార్మికులను అడిగితే ఎప్పటికైనా దేవస్థానంలో ఉద్యోగం వస్తుందన్న ఆశతోనే అనే సమాధానం చెబుతున్నారు. ఈఓ భ్రమరాంబ తమ కష్టాలపై స్పందించాలని కోరుతున్నారు.