శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 15 మార్చి 2022 (15:00 IST)

ఓ సీతా... రావణుడు పవళించే హంసతూలికా పాన్పు పైన శయనించేందుకు ఎందుకు అంగీకరించవు?

ఓ సీతా... రావణుడు పవళించే హంసతూలికా తల్పము గురించి చెప్పనలవి కాదు. అటువంటి పాన్పు పైన శయనించేందుకు నీవు ఎందుకు అంగీకరించవు. నీవు మానవ జాతి స్త్రీవి కనుక మానవునికే భార్యగా వుండాలని కోరుకుంటున్నావు. కానీ అంతకంటే గొప్పవాడైన రావణునికి భార్యగా వుండవచ్చు కదా.

 
నువ్వు ఎంత గొప్ప తపస్సు చేసినా రామునికి భార్యవు కావు. కనుక రావణుని భర్తగా పొంది ముల్లోకాలను జయించి తెచ్చిన సంపదలో విహరించు. నీవు త్రిలోక సుందరివి. త్రిలోక పాలకుడయిన రావణుని భార్య కాదగిన దానవు. కానీ రాజ్యభ్రష్టుడు, నిర్ధనుడు, తలచిన కోరిక తీర్చలేనివాడు అయిన ఆ రామునినే కోరుచున్నావే. ఇదంతా నీ వెర్రితనం కాదా, అని సీత మనసుకు మరింత అప్రియము కలిగించే రీతిగా చెప్పారు. 

 
ఈ మాటలు విన్న సీత దుఃఖితురాలై, కన్నీళ్లు పెట్టుకుని ఆ రాక్షస స్త్రీలకు సమాధానం చెప్పింది. ఓ రాక్షస స్త్రీలారా... మీరు చెప్పినదంతా కర్ణకఠోరంగా, న్యాయ విరుద్ధముగా వుంది. అది మిక్కిలి పాపమని మీ మనస్సుకు తోచలేదా? మనుష్య స్త్రీ రాక్షసునికి భార్యగా వుండతగదు. మీరు మీ ఇష్టప్రకారం నన్ను భక్షించండి. నేను మాత్రం రావణునికి భార్యను కాను.

 
నా భర్త రాజ్యభ్రష్టుడే కావచ్చు, దీనుడు కావచ్చు కానీ అతడే నాకు గురువు. సర్వోత్తముడు, పూజ్యుడు కూడాను. సూర్యుని వర్చస్సు ఎల్లప్పుడూ సూర్యునితోనే ఎలా వుంటుందో నేను కూడా నా భర్త పట్ల ఎల్లప్పుడూ అనురాగము కలిగి వుంటాను అని చెప్పింది సీతాదేవి.