మంగళవారం, 11 నవంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (18:50 IST)

Suryaprabha Seva: సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి.. వీక్షితే..?

Suryaprabha vahanam
Suryaprabha vahanam
తిరుమలలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవ రోజున అత్యంత ప్రకాశవంతమైన వాహన సేవకులలో ఒకటైన సూర్యప్రభ వాహన సేవను నిర్వహించారు. బద్రీనారాయణ అలంకరణలో శ్రీ మలయప్ప స్వామి భక్తులను ఆశీర్వదించారు. 
 
సూర్యప్రభ వాహన సేవ ప్రత్యేకంగా భక్తులలో ఆరోగ్యం, తేజస్సు, మొత్తం శ్రేయస్సును కోరడానికి రూపొందించబడింది. ఎందుకంటే సూర్యుడు వ్యాధులను తొలగించేవాడు. సూర్యుడిని శక్తిని ప్రదాతగా పూజిస్తారు. తిరుమల మాడ వీధుల్లో సూర్యప్రభ వాహనం శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తిరుమల చేరుకున్నారు.   
 
సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. 
 
అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. కాగా రాత్రి 7 గంటలకు చంద్ర‌ప్ర‌భ ‌వాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు అనుగ్ర‌హిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం 7 గంటలకు స్వామివారి రథోత్సవం వైభవంగా జరుగనుంది.