1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By దీవి రామాచార్యులు (రాంబాబు)
Last Updated : గురువారం, 12 నవంబరు 2015 (19:55 IST)

రాముడు సీతాదేవికి నారచీర ఎలా కట్టాలో నేర్పించాడా?

సీతతో సంవాదమునకు అనంతరం రాముడు లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి సిద్ధమవుతాడు. సీతను తనతోపాటు అడవులకు తీసుకుని వెళ్ళేందుకు అంగీకరించాడు. దశరథమహారాజును, కౌసల్యని ఒప్పించాడు. రాముని వెంట చతురంగ బలాలు పోవాలని అందులో సైనికులను మధురమైన మాటలతో సంతోషపరిచే ఆడవాళ్లు కూడా పోవాలని రాజు ఆజ్ఞాపించాడు. 
 
అప్పుడు రాముడు ''మహారాజా! నేను భోగాలన్నీ విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. నాకున్న ధనమంతా దానం చేసేశాను. సర్వసంగ పరిత్యాగినై అడవులకు వెళ్ళేందుకు సిద్ధపడ్డాను. అడవుల్లో లభించే కందమూలాలు తింటూ జీవించటానికి ఇష్టపడ్డాను. అటువంటి నాకు ఈ పరివారమంతా ఎందుకు? ఎవరైనా మంచి ఏనుగును దానం చేసి దాని కాలికి తాడును కోరుకుంటారా? అలాగే నేను రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్తున్నప్పుడు ఈ పరివారం, సేన నాకెందుకు? నేను పదునాలుగు సంవత్సరాలు అడవుల్లో వున్నప్పుడు కట్టుకునేందుకు నార బట్టలు ఇప్పించండి. కందమూలాలు తవ్వుకుని తినేందుకు ఒక గునపం, గంప ఇప్పించండి'' అంటాడు. అది విన్న వెంటనే కైకేయి ఆలస్యం చేయకుండా ముగ్గురికీ నార బట్టలు తెప్పించి ఇచ్చింది. 
 
అక్కడికక్కడే దశరథుని ముందు రాముడు తాను ధరించిన వస్త్రములను విడిచి నార బట్టలు ధరిస్తాడు. లక్ష్మణుడు కూడా నార బట్టలు ధరిస్తాడు. సీత ఆ నార బట్టలను చేతిలో తీసుకుని దుఃఖముతోను, సిగ్గుతోను తలవంచుకుని ఆ నార బట్టలను ఎలా కట్టుకోవాలి అని అమాయకంగా రాముణ్ణి అడిగింది. అప్పుడు రాముడు ఆమె చేతిలోని నారచీరను తన చేతిలోకి తీసుకుని ఆమె ధరించి వున్న పట్టువస్త్రములపైనే నార చీరని కట్టి చూపించాడు. ఆ సమయంలో అక్కడ వుండి ఆ సన్నివేశాన్ని చూస్తున్న స్త్రీలు అందరూ ఒక్కసారిగా ఘొల్లున ఏడ్చారు. 
 
అక్కడ వున్న అంతఃపుర స్త్రీలు, వశిష్ఠ మహర్షి కైకేయిని, రాముడిని ఎంతో బ్రతిమాలుకున్నారు సీతను వదిలి పొమ్మని. సీతాదేవి తనకు అత్యంత ప్రీతిపాత్రుడు, దైవ సమానుడు అయిన రాముని వెంట అడవులకు వెళ్ళుటకు సిద్ధపడింది. కైకేయి సీతకు కూడా నారచీరలను ఇవ్వడం చూసి అక్కడున్న జనం, వశిష్ఠుడు కైకేయిని అసహ్యించుకున్నాడు. దశరథుడు జీవితంపైన విరక్తి కలిగి కైకేయితో ఇలా అన్నాడు. 
 
''కైకా! సీత నారబట్టలు ధరించాల్సిన అవసరం లేదు. ఆమె ఇంకా యవ్వనంలో ఉంది. సుకుమారి. ఇంతవరకు సుఖాలే అనుభవించింది కావున ఆమెకు వనవాసం గురించి ఏమీ తెలియదు. ఆమె జనకమహారాజు కుమార్తె. ఆమె ఎవరికి ఏ అపకారం చేసిందని నారబట్టలు ధరించాలి? సీతను గూర్చి నేను నీకు ఎటువంటి వాగ్దానమూ చేయలేదు. కాబట్టి సీత ఆభరణాలను, మంచి బట్టలను తీసుకుని పోవచ్చును.." అని చెబుతూనే దుఃఖసాగరంలో మునిగిపోయాడు. 
 
అయినా కైకేయి మనస్సు కరగలేదు. ఎంతో ప్రేమగా ఆప్యాయంగా వున్న భార్య ఒక్కసారిగా అంత కఠినంగా ఎలా మారిపోయింది. ఆస్తులు, అంతస్తులు, రాజభోగాలు సమకూర్చిన భర్తకు ఒక్క క్షణంలో అంత దుఃఖాన్ని ఎలా ఇవ్వగలిగింది. ప్రేమగా వున్నప్పుడు దశరథ మహారాజుకు చిన్న కష్టం వస్తేనే విలవిలాపోయిన కైకేయి తన స్వార్థం కోసం, తన పంతాన్ని గెలుచుకోవడం కోసం, పట్టుదలకు లోనై చివరకు తన భర్త పుత్రశోకంతో చనిపోతున్నాడు అని తెలిసినా, గుండెల్లో ఎంతమాత్రము కనికరము లేకుండా కఠినంగా ప్రవర్తించింది. చివరికి తన అయిదవతనం పోయి విధవరాలుగా మిగిలిపోతుంది అని తెలిసినా కైకేయి మనస్సు కరగలేదు. 
 
దశరథమహారాజు కోశాధ్యక్షుణ్ణి పిలిపించి పదునాలుగు సంవత్సరాలకు కావలసిన విలువైన వస్త్రాలను, ఆభరణాలను తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అతను తీసుకుని వచ్చినవాటిని సీత చక్కగా అలంకరించుకుంది. అంత కష్టంలో కూడా ముఖంలో ఏమాత్రం దైన్యములేని సీతను కౌసల్య కౌగిలించుకుని "సీతా! ఈ లోకములో పాతివ్రత్యములేని స్త్రీలు, వారిని భర్తలు ఎంతగా గౌరవించుచున్నను, ఆ భర్తలు దుర్దశలో వున్నప్పుడు వారిని అనుమానింతురు. స్త్రీలు ముందు తామెంత సుఖమును అనుభవించినను, ఏ చిన్న ఆపద వచ్చినను కూడా తాము చెడిపోవుదురు. భర్తను కూడా పరిత్యజింతురు. దుష్టాలోచనలుగల యువతులు సర్వమూ కపట వచనములను పలుకుచుందురు. కోపతాపాది వికారములకు లోనగుచుందురు. వారు చిన్న చిన్న సంఘటనలకే పతులపై అలుక వహించి వారికి దూరమగుదురు. అట్టి స్త్రీలకు భర్త యొక్క గొప్ప వంశముగాని, అతడు చేసిన ఉపకారములుగాని, అతని యొక్క విద్యావైభవములుగాని, అతడు తెచ్చిపెట్టిన వస్త్రాభరణములుగాని, ప్రేమతో అతడు తనను చేపట్టిన రీతిగాని జ్ఞాపకమునకు రాదు. అంతేకాదు వారు పాత విషయములను త్రవ్వుచు భర్తతో ఎల్లప్పుడూ గొడవపడుచుందురు. 
 
కానీ శీలమునందు, సత్యమునందు, శాస్త్రమునందు స్థిరమైన చిత్తముగల పతివ్రతలైన స్త్రీలకు మాత్రము ఒక్క భర్తయే పరమ పవిత్రుడుగా విశిష్టస్థానమును పొందివుండును. అరణ్యమునకు పంపివేయబడుచున్న నా కుమారుని నీవు అవమానించకూడదు. ధనమున్నవాడైనను, ధనములేని వాడైనను, రామున్ని నీవు దేవతగా చూచుకొనవలెను.." అని సీతకు ఉపదేశించెను. 
 
రాజ్యపాలన చేయవలసిన తన కొడుకు ఒక్కరోజు సమయములో అడవులకు వెళ్లవలసివస్తే ఆ తల్లి హృదయం ఎంత క్షోభిస్తుందో కౌసల్యను చూస్తే తెలుస్తుంది. సంతోషంగా వేడుకలు జరుపుకునే సమయంలో ఒక దుర్వార్త వలన ఆ కుటుంబ సభ్యులందరూ దుఃఖములో ఎంత కృంగి పోతారో అలా దశరథ మహారాజు కుటుంబం, ప్రజలు అంత దుఖఃసాగరంలో మునిగిపోయారు. ఒక్క కైకేయి తప్ప. 
 
అలాంటి సమయంలో కూడా ధైర్యాన్ని విడవకుండా, ఎవ్వరిమీదా నిందవేయకుండ రామునితో అడవులకు పోవటానికి నిర్ణయించుకున్న సీత కౌసల్యతో, "పూజ్యులారా! నీకు నమస్కరించి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నీవు చెప్పినట్లే నడుచుకుంటాను. భర్త విషయంలో ఎలా ప్రవర్తించాలో నా తల్లిదండ్రులు నాకు నేర్పి పంపించారు. చంద్రుణ్ణి వెన్నెల ఎన్నడూ వదిలిపెట్టనట్లు, నేను ధర్మాన్ని విడువను. తీగలు లేకుండా వీణ మోగనట్టు, చక్రాలు లేకుండా రథం నడవనట్లు, నా భర్తను వదిలి నేను వుండను. ఎంతమంది కొడుకులు వున్ననూ భర్తలేని స్త్రీ సుఖపడదు. తల్లిదండ్రులు ఆడపిల్లలకు ఏమి ఇచ్చిననూ భర్త ఇచ్చిన దానికి తక్కువగానే వుండును. నేను మహాపతివ్రతల వలన చాలా విషయాలు నేర్చుకున్నాను. నా భర్తను ఎన్నటికీ అలక్ష్యం చేయను. ఆయనే నాకు దేవుడు.." ఇలా చెబుతుంటే కౌసల్య పులకించిపోయింది. 
 
రాముడు కౌసల్యకు ప్రదక్షిణం చేసి దశరథ మహారాజుకు పాదాభివందనం చేసి వనవాసానికి ప్రయాణమగుటకు సిద్ధమయ్యాడు. సీతారాములతో పాటు లక్ష్మణుడు వీరిని నమస్కరించి తన కన్న తల్లి సుమిత్ర వద్దకు వెళ్ళాడు. ఆమెకు శిరస్సు వంచి నమస్కరించాడు. ఒక్కసారిగా సుమిత్రాదేవి గుండెలోని దుఃఖము ఉప్పెనలా బయటికి వచ్చింది. తన కుమారుణ్ణి గట్టిగా పట్టుకుని బోరున ఏడ్చింది. 
 
ఈ సన్నివేశం చూస్తుంటే రామాయణంలో అన్ని పాత్రలూ ఎంత గొప్పవి అనిపిస్తుంది. కైకేయి రాముడినే అడవులకు పోవాలని కోరింది కాని, లక్ష్మణస్వామిని కూడా పొమ్మని చెప్పలేదు. అలాంటప్పుడు సుమిత్ర తన కొడుకుని రామునితో అడవులకు పంపవలసిన అవసరం లేదు. అందుకని లక్ష్మణునితో నువ్వు అడవులకు పోవలసిన అవసరం లేదు. హాయిగా అయోధ్యలో రాజభవనంలో సుఖంగా జీవితాన్ని గడుపు. రాముని వనవాసం కైకేయికి దశరథుడికి, రామునికి సంబంధించిన విషయం అని చెప్పలేదు. 
 
రాముడు లోకకళ్యాణం కోసం పుట్టితే, రాముని సేవ నిరంతరం చేసుకునేందుకు నిన్ను నేను కన్నాను. మీరిద్దరూ కారణజన్ములు. రాముణ్ణి, సీతను కంటికి రెప్పలా చూసుకో. వారికి సేవలు చేసుకో. రాముడే నీకు తండ్రి, సీత నీకు తల్లిలాంటిది. అడవి నీకు అయోధ్య అని తలచుకుని ఈ పదునాలుగు సంవత్సరాలు రాముడికి సేవలు చేస్తూ అన్నగారితో సుఖంగా వెళ్ళిరా.. అని లక్ష్మణున్ని సుమిత్ర దీవించింది. (జానకి రామాయణము నుంచి- ఇంకా వుంది) దీవి రామాచార్యులు (రాంబాబు)