బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By tj
Last Updated : బుధవారం, 22 మార్చి 2017 (13:57 IST)

తిరుమలలో మరో బాగోతం - సేవా టిక్కెట్లను విక్రయించిన తితిదే సూపరింటెండెంట్..!

తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్లను విక్రయించి కోట్ల రూపాయలు సంపాదించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు దళారులనే చూసిన తితిదే అధికారులు ప్రస్తుతం తాజాగా ఇంటి దొంగల పనే ఎక్కువగా ఉందన్న నిర్

తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్లను విక్రయించి కోట్ల రూపాయలు సంపాదించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు దళారులనే చూసిన తితిదే అధికారులు ప్రస్తుతం తాజాగా ఇంటి దొంగల పనే ఎక్కువగా ఉందన్న నిర్ధారణకు వచ్చారు. వేలకు వేలు జీతాలు సంపాదించడమే కాదు.. అక్రమంగా డబ్బులు సంపాదించడానికి అడ్డదారుల్లో పయనిస్తున్నారు. క్రిందిస్థాయి సిబ్బంది కన్నా ఉన్నతస్థానంలో ఉన్న తితిదే ఉద్యోగస్తులే ఇలాంటి పని చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది.
 
తిరుమలలో తితిదే నిర్వహించే పలు కార్యక్రమాలకు సంబంధించి భక్తుల నుంచి విరాళాలను సేకరిస్తుంటారు. నిత్యాన్నదానానికైనా లేకుంటే మిగిలిన వాటికి దేనికైనాసరే. కేవలం డిడిల రూపంలోను చెక్కుల రూపంలోనూ వీటిని స్వీకరిస్తుంటారు. అలాంటి డోనర్లకు ప్రత్యేకంగా టిటిడి కొన్ని సేవలను అందిస్తోంది. స్వామివారికి సంబంధించిన సేవలను ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తుంటుంది. అయితే ఆ డోనర్ సేవలనే నకిలీ చేసేశారు కొంతమంది ఉద్యోగస్తులు. ఏకంగా తితిదే ఉద్యోగులే ఈ నకిలీ డోనర్ టిక్కెట్లను తయారు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది.
 
తిరుమలలోని జేఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ ధర్మయ్య కొంతమంది భక్తులకు మంగళవారం తొమ్మిది బ్రేక్ టిక్కెట్లను అందించాడు. డోనర్ కోటాలో ఈ టిక్కెట్లను ఇచ్చాడు. వీటిని తీసుకుని దర్శనానికి వెళ్ళిన భక్తులను తితిదే సిబ్బంది విచారించగా ఆ టిక్కెట్లు నకిలీవని తేలిపోయింది. ఒక్కో టిక్కెట్‌ను వేల రూపాయలకు ధర్మయ్య విక్రయించినట్టు సమాచారం. ఆన్‌లైన్‌లోనే ప్రతి టిక్కెట్ నమోదవుతుంది. అలాంటిది డోనర్ టిక్కెట్‌ను ఆన్‌లైన్‌లో పొందుపరచకుండానే ఎంతో ధైర్యంతో సూపరింటెండెంట్ ధర్మయ్య వాటిని భక్తులకు అమ్మడం ప్రస్తుతం పలు అనుమానాలకు తావిస్తోంది. 
 
తితిదేలో ధర్మయ్య ఒకరే కాదు చాలామంది ఉద్యోగస్తులు ఇదే పనిచేస్తుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇపుడు ధర్మయ్య పట్టుబడ్డారు. రేపు ఇంకొకరు. ఇలా చాలామందినే. ప్రస్తుతం పట్టుబడిన ధర్మయ్యను టిటిడి విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. గతంలో సీఎం పేషీలో ధర్మయ్య పనిచేశారు. వేల రూపాయల జీతం తీసుకుంటున్నారు. అలాంటిది ఇలాంటి దళారీ పని ఏంటన్నది మిగిలిన కొంతమంది నిజాయితీ ఉద్యోగస్తుల ప్రశ్న. ఏదిఏమైనా ప్రస్తుతం ధర్మయ్య పట్టుబడటం మాత్రం తితిదేలో చర్చనీయాంశంగా మారింది. తితిదే ఈఓతో పాటు తితిదే జెఈఓ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.