శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 మే 2024 (22:52 IST)

అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. మట్టపల్లి నరసింహుడిని దర్శించుకోండి..

Mattapalli Yoga Narasimha Swamy
Mattapalli Yoga Narasimha Swamy
అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. అయితే ఇక బాధపడనక్కర్లేదు. తెలంగాణలోని నల్గొండ, మట్టపల్లి నరసింహ స్వామిని దర్శించుకుంటే చాలు. అడవీ ప్రాంతం, కృష్ణానదీ తీరాన గల ఈ ఆలయంలోని నరసింహ స్వామిని దర్శించుకుంటే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. 
 
సప్త ఋషులలో ఒకరైన భరద్వాజ మహర్షి ఇక్కడ గుహలో ఉన్న ఈ స్వామిని చాలా కాలం పూజించారు. సప్తురుషులచే పూజలందుకున్న ఈ నరసింహ స్వామిని పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అన్నాలయంగా పేరుగాంచింది. ఇక్కడ నిత్య అన్నదానం చేస్తారు. సుమారు 11 వ శతాబ్దం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతోంది. 
 
పదకొండు వందల సంవత్సరాల క్రితం మట్టపల్లికి ఎదురుగా కృష్ణానదికి అవతల ఒడ్డున ఓ ఊరిలో మాచిరెడ్డి అనే మోతుబరి రైతు, ఆయన కుటుంబీకులందరూ చాలా ఉదార స్వభావం కలవారు.  మాచిరెడ్డికి ఒకరోజు స్వప్నంలో ప్రసన్న వదనుడైన శ్రీ నరసింహస్వామి దర్శనమిచ్చి, స్వయంభువు అయి తన మూర్తి విగ్రహం కృష్ణానదికి అవతల ఒడ్డున ఉన్న అరణ్యంలో ఒక గుహలో ఉన్నదని, ఆ మూర్తిని ఇప్పటిదాకా భరద్వాజుడు మొదలగు మహర్షులు మాత్రమే సేవిస్తున్నారనీ, ఆ ఋషుల సంకల్పానుసారం ఇంక ముందు మనుషులకు కూడా దర్శనం ఇవ్వాలనుకున్నానని…ఈ విషయాన్ని లోకానికి తెలియపరచమని ఆదేశించాడు. 
 
మరునాడు మాచిరెడ్డి ఇతర పెద్దలతో కలిసి అరణ్యంలో వెతకగా స్వామివారి విగ్రహం కనిపించింది. వీరు దర్శించు సమయంలో స్వామి శంఖ చక్రములు, గద, అభయముద్రలతో చతుర్భుజుడై, శేషుడు గొడుగు పట్టగా మహర్షులు అభిషేకించే దక్షిణావర్త శంఖముతో, తులసీదళమాలతో, భక్త ప్రహ్లాదునితో, దివ్య దర్శనమిచ్చాడు. 
 
స్వామివారిని సకల జనులు సేవించుటకు వీలుగా విగ్రహ ప్రతిష్ట చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. ఈ క్షేత్రమునకు వచ్చిన భక్తులు కృష్ణలో స్నానం చేసి, స్వామి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ఆరె చెట్టు, ధ్వజ స్తంభం, ఆంజనేయస్వామి చుట్టూ 32 ప్రదక్షిణలు చేస్తారు.
 
ఇది ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత. ఈ క్షేత్రంలో యమధర్మరాజు స్వయంగా వచ్చి ప్రదక్షిణలు చేశారుట. అందుకే ఈ క్షేత్రానికి యమ మోహిత క్షేత్రమని కూడా పేరు. ట్టపల్లి క్షేత్రం నల్గొండ జిల్లా హుజూర్ నగర్ కి 25 కి.మి దూరంలో కలదు. హుజుర్‌నగర్‌ నుంచి ఈ ఆలయానికి వెళ్లేందుకు ఆటోతో పాటు బస్సు సౌకర్యం ఉంది.