గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By chj
Last Modified: బుధవారం, 10 జనవరి 2018 (21:15 IST)

పాము, ముంగిస, నెమలి అక్కడ ఆడుకుంటూ కనిపించాయి...

తండ్రీతనయులు ఒకేచోట కొలువుతీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవ క్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. పుట్టలో సర్పరూపంలో వెలసిన కార్తికేయుడు నిజంగా భక్తుల పాలిట కొంగుబంగారమే. దీపావళి అనంతరం వచ్చే నాగుల చవితి రోజున ఈ క్షేత్రానికి దేశం న

తండ్రీతనయులు ఒకేచోట కొలువుతీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవ క్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. పుట్టలో సర్పరూపంలో వెలసిన కార్తికేయుడు నిజంగా భక్తుల పాలిట కొంగుబంగారమే. దీపావళి అనంతరం వచ్చే నాగుల చవితి రోజున ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఇక్కడి పుట్టకు విశేష పూజలు నిర్వహిస్తారు.
 
ఇంద్రాది దేవతల ప్రార్థనలను మన్నించిన అగస్త్య మహర్షి లోపాముద్ర సహితుడై కాశీపట్టణాన్ని వదిలి దక్షిణ భారతదేశంలో పర్యటించాడు. మార్గమధ్యంలో శిష్యులతో కలిసి కృష్ణా నదీతీరంలోని మోహినిపురంలో సేదతీరుతుండగా జాతి వైరాన్ని మరిచి పాము, ముంగిస, నెమలి ఆడుకుంటూ కనిపించాయి. ఆ పక్కనే దివ్య తేజస్సును విరజిమ్ముతూ ఉన్న ఒక పుట్ట ఆయన దృష్టిని ఆకర్షించింది. 
 
దగ్గరకు వెళ్ళిచూడగా కార్తికేయుడు సర్పరూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు. దివ్యదృష్టితో కార్తికేయుడి రూపాన్ని వీక్షించిన అగస్త్యుడు పుట్టపైన ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆరాధించాడు. ఇది తెలిసుకున్న దేవతలు కూడా ఇక్కడికి చేరి స్వామిని పూజించారు.
 
పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి, తాను పుట్టలో ఉన్నానని, తనని బయటకు తీసి ఆలయాన్ని నిర్మించమనీ ఆజ్ఞాపించాడట. అప్పుడు పర్వతాలు ఆ స్వప్నాన్ని పెద్దలకు తెలియజేసి స్వామి అభీష్టం మేరకు ఆలయాన్ని నిర్మించి, షణ్మఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్టించాడు.
 
స్వామి మహిమను తెలుసుకున్న దేవరకోట సంస్థానాధీశులు, చల్లపల్లికి చెందిన యార్లగడ్డ రాజవంశీయులూ ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆ మోహినిపురమే మోపిదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి సుమారు ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. సర్పాకృతిలో తనయుడైన కుమారస్వామి, లింగాకృతిలో శివుడు కొలువై ఉండటం వల్ల ఈ క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. రాహు, కేతు, సర్ప దోషాలను నివారించే ఇలవేల్పుగా ఇక్కడ స్వామి పూజలు అందుకుంటున్నాడు. 
 
సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంలో పుట్టలో కొలువై ఉన్నాడని భక్తుల విశ్వాసం. నాగుల చవితి రోజున పుట్ట దగ్గరకు వెళ్ళి ఆయనను పూజిస్తే సంతానం లేని వారికి పిల్లలు పుడతారని ఇక్కడి వారి నమ్మకం. పుట్టమట్టిని ప్రసాదంగా ధరించడం వల్ల వ్యాధులు దరిచేరవని ప్రతీతి. సర్పం జ్ఞానానికి సంకేతం. అందుకే ఆ రూపంలో ఉన్న స్వామిని ఆరాధించిన వారికి మంచి విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి.