గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (19:35 IST)

వినాయకుడిని కొట్టిన విభీషణుడు.. ఎందుకు? (video)

విఘ్నేశ్వరుడు దీనజన రక్షకుడు. మొదటిగా పూజిస్తే శుభకార్యాలు ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. నిండు మనస్సుతో పూజించిన వారిని తప్పకుండా అనుగ్రహిస్తాడు. తమిళనాడులోని తిరుచ్చిలోని రాక్‌ఫోర్ట్‌పై స్వామి స్వయంభువుగా వెలసి ఆశిస్సులు అందిస్తుంటాడు. సాధారణంగా వినాయకుని ఆలయాలు భూమిపైన ఉంటాయి, కానీ ఇక్కడ కొండపై ఉండటం విశేషం. ఈ ఆలయానికి స్థల పురాణం ఉంది.   
 
సీతను బందీగా ఉంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రావణుని సోదరుడు విభీషణుడు వెంటనే రాముని వద్దకు వెళ్లి ఆశ్రయం పొందుతాడు. యుద్ధంలో శ్రీరాముడు రావణుడిని సంహరిస్తాడు. విభీషణుడు తనకు చేసిన సాయానికి గుర్తుగా రంగనాథుని విగ్రహాన్ని రాముడు ప్రదానం చేస్తాడు. అయితే విభీషణుడు అసురుడు. దీంతో దేవతలు రంగనాథ స్వామి విగ్ర‌హం శ్రీలంకకు చేరుకోకుండా అడ్డుకోవాలని నిర్ణయిస్తారు. ఇందు కోసం గణపతిని ప్రార్థిస్తారు. స్వామి ప్రత్యక్షమై వారి కోరికను నెరవేరుస్తానని మాట ఇస్తారు. 
 
విభీషణుడు తిరుచ్చి సమీపంలో విగ్రహాన్ని తీసుకువెళుతుండగా కావేరి నది కనిపించడంతో పుణ్యస్నానం ఆచరించాలని భావిస్తాడు. కానీ విగ్రహాన్ని నేల మీద పెడితే శాశ్వతంగా అక్కడే ఉండిపోతుంది. దీంతో అక్కడే పశువులు కాస్తున్న బాలుడిని సాయం కోరుతాడు. కొద్ది సమయం మాత్రమే తాను విగ్రహాన్ని పట్టుకుంటానని సమయం ముగిసిన తరువాత భూమిపైన పెట్టివేస్తానని బాలుడు చెప్పడంతో అందుకు అంగీకరించిన విభీషణుడు విగ్రహాన్ని అతనికి అందజేస్తాడు. బాలుని రూపంలో ఉన్నది సాక్షాత్తు వినాయకుడు కావడం విశేషం. 
 
కొద్ది సేపటికే గణపతి శ్రీరంగనాథ‌ స్వామి విగ్రహాన్ని భూమిపైన పెట్టడంతో నదిలో ఉన్న విభీషణుడు ఆగ్రహించి పరుగున ఒడ్డుకు వచ్చాడు. అయితే ఎంత ప్రయత్నించినా రంగనాథుని విగ్రహాన్ని అక్కడ నుంచి తీయడం సాధ్యపడలేదు. దీంతో ఆగ్రహంతో బాలుడిని పట్టుకోవాలని చూస్తాడు. బాలుడు వెంటనే పారిపోతాడు. అతన్ని పట్టుకోవాలని వెంటపడ్డాడు.
 
చాలాదూరం పరుగెత్తిన వినాయకుడు ఒక కొండపైకి వెళ‌తాడు. చివరకు బాలుడిని పట్టుకున్న విభీషణుడు నుదుటిపై గట్టిగా కొట్టడంతో స్వామి నవ్వుతూ అసలు రూపంతో దర్శనమిచ్చాడు. వెంటనే విభీషణుడు స్వామివారిని క్షమాపణలు కోరాడు. గణపతి అతనిని అనుగ్రహించాడు. శ్రీరంగనాథ‌స్వామి కావేరి తీరంలోనే ఉంటారని వెల్లడిస్తాడు. అనంతరం వినాయకుడు అక్కడే స్వయంభువుగా వెలసినట్టు తెలుస్తోంది.