మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 డిశెంబరు 2020 (14:33 IST)

వినాయకుడి ఆలయంలో గరుడాళ్వార్.. శ్రీపతి కూడా.. ఎక్కడంటే? (video)

Thenpoondipattu Vinayaka Temple
వినాయకుడిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి. విఘ్నాలను తొలగించే ఆ రాజును కొలిచే వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సాధారణంగా విఘ్నేశ్వర స్వామిని కొలిస్తే అష్టైశ్వర్యాలు, సర్వశుభాలు చేకూరుతాయి. అలాంటిది మరిన్ని విశేష ఫలితాలను అందించే వినాయకుడిని కొలిస్తే..? అవును అలాంటి వినాయక స్వామి ఆలయాన్ని గురించే ప్రస్తుతం ఈ కథనంలో చూడబోతున్నాం.  
 
ఆ ఆలయం ఎక్కడుందంటే.. సుప్రసిద్ధ ఆలయాలకు నిలయమైన కాంచీపురానికి సమీపంలో. తమిళనాడు, కాంచీపురంకు సమీపంలో ''తెన్‌పూండిపట్టు'' అనే గ్రామంలో ఈ ఆలయం వెలసి వుంది. అగ్నిలింగం వెలసిన అరుణాచలేశ్వర స్వామి ప్రాంతమైన తిరువణ్ణామలై జిల్లాలోని చెయ్యారు రోడ్డు, వెంబాక్కంకు తర్వాతి గ్రామమైన తెన్‌పూండిపట్టులో ఈ ఆలయం వెలసి వుంది.
 
ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే..? కొండపై విఘ్నేశ్వరుడు వెలసి వుండటం. చిన్నపాటి కొండపై వెలసిన విఘ్నేశ్వరుడు ఈ గర్భగుడిలో రెండు విఘ్నేశ్వరులు వుంటారు. అదే ఈ ఆలయ విశేషం. అలాగే సాధారణంగా వినాయక ఆలయంలో మూషికమే వాహనంగా వుంటుంది. ఈ గుడిలో గరుడాళ్వార్ వినాయకుని ముందుంటారు. ఇదేంటి గరుడాళ్వార్ వుంటే శ్రీవారు అదే మహావిష్ణువు వుండాలి కదా అనుకుంటున్నారు కదూ. ఆయన కూడా వున్నారు. 
 
అంటే తెన్‌పూండిపట్టులోని వినాయకుడి ఆలయం గర్భగుడిలో ఇద్దరు విఘ్నేశ్వరులు, శ్రీలక్ష్మితో కూడిన శ్రీపతి అంటే నారాయణుడు కొలువై వున్నాడు. ఈ గర్భగుడికి ఎదురుగా గరుడ స్వామి, మూషిక వాహనాలున్నాయి. కొండపై వెలసిన ఈ ఆలయం చుట్టూ ప్రకృతి పచ్చదనం కంటికి ఆహ్లాదకరంగా వుంటుంది. ఆలయం చుట్టూ తులసీ మొక్కలు, వివిధ పుష్పాలకు చెందిన మొక్కలుంటాయి. 
 
ఈ ఆలయాన్ని దర్శించిన వారికి సంతాన ప్రాప్తి చేకూరుతుందని, వివాహ అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం. ఈ ఆలయంలో గణపతి మూర్తులు ఇద్దరుగా, విష్ణుమూర్తి కూడా విఘ్నేశ్వరుడితో కొలువై వున్నందున ఆర్థిక ఇబ్బందులు వుండవని.. రుణబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కాబట్టి కాంచీపురంకు వెళ్లే భక్తులు ఈ ఆలయాన్ని కూడా సందర్శించుకుంటే విశేష ఫలితాలను పొందవచ్చునని వారు సెలవిస్తున్నారు.