శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (17:11 IST)

''వల్లభి'' ఆలయంలోని విగ్రహాలు ఓ భక్తుడివట!.. కృష్ణుడి కోరిక మేరకే?

వల్లభి కృష్ణుడి ఆలయం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పరిధిలో వెలసింది. ఈ ఆలయంలోని మూల విగ్రహాలు ఓ భక్తుడిచే పూజలందుకోబడినవి స్థల పురాణాలు చెబుతున్నాయి. వల్లభిలో రుక్మిణీ సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకప్పుడు ఒక భక్తుడి పూజా మందిరంలోనివట.
 
చాలాకాలం క్రితం ఈ గ్రామంలో ఒక కృష్ణ భక్తుడు ఉండేవాడట. రుక్మిణీ సత్యభామ సమేతుడైన కృష్ణుడి విగ్రహాలు ఆయనకి ఎలా లభించాయనేది తెలియదు. ఆయన మాత్రం అనునిత్యం వాటిని పూజిస్తూ ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉండేవాడు. వయసు పైబడుతున్నా ఆయన భక్తి శ్రద్ధలు ఎంతమాత్రం తగ్గలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజున ఆయన స్వప్నంలో కృష్ణుడు కనిపించాడట.
 
పవిత్రమైన ... ప్రశాంతమైన ఈ ప్రదేశం తమకి ఎంతగానో నచ్చడం వల్లనే తాము ఇక్కడ కొలువై ఉన్నామని కృష్ణుడు తన భక్తుడితో చెబుతాడు. అంతకాలంగా తమని సేవిస్తూ వచ్చిన కారణంగా ఆయన వంశం తరిస్తుందని అంటాడు. 
 
ఇక తమ ప్రతిమలకు ఆలయాన్ని నిర్మించి అందరిచే పూజలు అందుకునేలా చేయమని సెలవిస్తాడు. అంతస్తోమత ఆ భక్తుడికి లేకపోయినా, భగవంతుడి అనుగ్రహం కారణంగా ఆ విగ్రహాలకు ఆలయం నిర్మించబడింది.
 
శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన కారణంగానే ఈ గ్రామానికి 'వల్లభి' అనే పేరు వచ్చింది. ఈ  స్వామివారిని దర్శించడం వలన కష్టాలు కనిపించకుండా పోతాయనీ, సంతోషాలు సమకూరతాయని, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.